రెండు కాళ్ల‌నూ పోగొట్టుకున్న ప్రియుడితో..ఆసుప‌త్రి బెడ్ మీదే!

చెన్నై: ప‌్రేమ‌కు అంగ‌వైక‌ల్యం అడ్డు కాద‌ని నిరూపించిందో యువ‌తి. తాను ప్రేమించిన యువ‌కుడు ప్ర‌మాదానికి గురై, రెండు కాళ్ల‌నూ కోల్పోవాల్సి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆమె ప్రేమ చెక్కు చెద‌ర‌లేదు. ఆసుప‌త్రి బెడ్ మీదే అత‌నితో తాళి క‌ట్టించుకుంది. ఈ పెళ్లికి ఆ యువ‌తి త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు కూడా ఆశీర్వదించ‌డం గొప్ప విష‌యం.

ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని రాయ‌వేలూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వాణియంబాడి కొనమేడుకు చెందిన విజయ్, నీలగిరి జిల్లా ఊటీకి చెందిన శిల్పా ప్రేమించుకొన్నారు. కోయంబత్తూరులో ఒకే క‌ళాశాల‌లో చ‌దువుకున్నారు. చ‌దువుకునే స‌మ‌యంలోనే వారి మ‌ధ్య ప్రేమ మొద‌లైంది.

చ‌దువు పూర్త‌యిన త‌రువాత విజయ్ ఉద్యోగం కోసం బెంగుళూరుకు రైలులో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకొంది. రైలు నుంచి ప్రమాదవశాత్తు విజయ్ కొందపడిపోయాడు. దీంతో అతనికి రెండు కాళ్ళను తొలగించారు డాక్ట‌ర్లు. ప్ర‌స్తుతం విజ‌య్ వాణియంబాడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారు.

ఈ విష‌యం శిల్ప‌కు తెలిసిన త‌రువాత అత‌నికి అండ‌గా నిల‌వాల‌ని, అత‌ణ్ని పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రెండురోజుల పాటు ఆసుప‌త్రిలోనే గ‌డిపారు. అనంత‌రం ఊటికి వెళ్లి, త‌న తల్లిదండ్రుల‌కు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కాళ్లు పోగొట్టుకొన్న విజయ్‌తో వివాహనికి వారు మొద‌ట ఒప్పుకోలేదు.

శిల్పా మాత్రం తన పట్టుదలను వదులుకోలేదు. చివ‌రికి వారు అంగీక‌రించారు. పెద్ద‌లు, స్నేహితుల స‌మ‌క్షంలో ఆసుపత్రి బెడ్ మీదే విజ‌య్‌తో తాళి క‌ట్టించుకున్నారు. రెండు కుటంబాల పెద్ద‌లు, వారి స్నేహితులు, డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఆసుప‌త్రి సిబ్బంది వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here