తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు పెంట్‌హౌస్‌లో క‌లుసుకున్న ప్రేమికులు..కొన్నిగంట‌ల త‌రువాత!

ప‌దంత‌స్తుల అపార్ట్‌మెంట్ స‌మీపంలో యువ‌తీ, యువ‌కుల మృత‌దేహాలు క‌నిపించ‌డంతో స్థానికులు ఉలిక్కిప‌డ్డారు. క‌ళ్లు నులుముకుంటూ కిటికీ తెరిచిన అపార్ట్‌మెంట్‌వాసుల‌కు క‌ళ్లెదురుగా రెండు మృత‌దేహాలు క‌నిపించే స‌రికి నిద్ర‌మత్తు ఎగిరిపోయింది.

ర‌క్త‌పుమ‌డుగులో క‌నిపించాయా మృత‌దేహాలు. ఈ స‌మాచారాన్ని వెంట‌నే పోలీసుల‌కు తెలియ‌జేశారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ఆరంభించారు.

మృత‌దేహాల‌తో పాటు సంఘ‌ట‌నాస్థ‌లంలో ల‌భించిన ఆత్మ‌హ‌త్య లేఖ‌ను స్వాధీనం చేసుకున్నారు. త‌మ ప్రేమ‌ను పెద్ద‌లు అంగీక‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు లేఖ‌లో రాసి ఉందని పోలీసులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో చోటు చేసుకుంది. ల‌క్నోలోని కైజ‌ర్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఓజ‌స్ తివారీ, జోప్‌లింగ్ ప్రాంతంలో ఉన్న సూర‌జ్‌దీప్ అపార్ట్‌మెంట్‌లో త‌న కుటుంబంతో క‌లిసి నివాసం ఉండే కాజల్ పాండే మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

కొద్దిరోజుల కింద‌టే వారి ప్రేమ వ్య‌వ‌హారం రెండు కుటుంబాల్లోనూ తెలిసింది. వారి ప్రేమ‌ను అంగీక‌రించ‌లేదు. ఫ‌లితంగా.. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు.

బుధ‌వారం తెల్ల‌వారు జామున 4 గంట‌ల‌కు ఓజ‌స్ తివారీ సూర‌జ్‌దీప్ అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌కు వెళ్లాడు. అక్క‌డే కాజ‌ల్ పాండే అత‌డిని క‌లుసుకుంది.

అనంత‌రం..6 గంట‌ల స‌మ‌యంలో అపార్ట్‌మెంట్ పైనుంచి కిందికి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

తాను 5:30 గంట‌ల స‌మ‌యంలో అపార్ట్‌మెంట్ చుట్టూ తిరిగొచ్చాన‌ని, అప్ప‌టికీ మృత‌దేహాలు లేవ‌ని సెక్యూరిటీ గార్డు పోలీసుల‌కు తెలిపాడు. హ‌జ‌ర‌త్‌గంజ్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here