సిటీ నుంచి అర్ధాంత‌రంగా ఇంటికొచ్చిన కుమారుడు..తెల్లారేస‌రికి ప్రేయ‌సితో!

వికారాబాద్‌: త‌మ పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఓ ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఒకే తాడుకు ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.అమ్మాయికి వేరొక‌రితో నిశ్చితార్థం కూడా ఖ‌రారు కావ‌డంతో జీర్ణించుకోలేక వారిద్ద‌రూ ఈ త‌నువు చాలించిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు.

జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మంజులను ప్రేమించాడు. మంజుల ఇంట‌ర్ వ‌ర‌కూ చ‌దివింది. సుమారు ఏడాది కాలంగా వారు ప్రేమించుకుంటున్నారు.

ఈ విష‌యం ప్ర‌వీణ్ ఇంట్లో తెలిసే స‌రికి వారు భ‌గ్గు మ‌న్నారు. అదే స‌మ‌యంలో మంజుల ఇంట్లో కూడా ఆమె ప్రేమ వ్య‌వ‌హారం వెల్ల‌డైంది. దీనితో వారు హుటాహుటిన వేరే సంబంధాన్ని తీసుకొచ్చారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కొడంగల్‌ మండలం రావల్‌పల్లికి చెందిన యువ‌కుడితో నిశ్చితార్థాన్ని ఖ‌రారు చేసుకున్నారు. ఈ విష‌యాన్ని ఆమె ప్రవీణ్‌కు తెలియ‌జేసింది. దీనితో ప్ర‌వీణ్ ఆదివారం రాత్రి స్వ‌గ్రామానికి వ‌చ్చాడు. అదే రోజు రాత్రి వారిద్ద‌రూ ఊరి బ‌య‌ట చెట్టుకు ఉరేసుకుని కనిపించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here