రెండు రోజుల చిన్నారిని బ్రతికించడానికి ‘రంజాన్ ఉపవాస దీక్ష’ను విరమించాడు..!

ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం అంటే ఎంతో ప్రీతిపాత్రమైనది. రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా’ రోజా ‘ ఉపవాస దీక్షలను పాటిస్తారు. ఎంత ఇబ్బంది కలిగినా ఉపవాస దీక్షను విరమించాలని కోరుకోరు. అయితే ఓ చిన్నారి ప్రాణం కాపాడడానికి ఓ వ్యక్తి ఒక్కపొద్దును విరమించాడు. ప్రజలంతా అతడు చేసిన మంచిపనికి సలామ్ కొడుతున్నారు.

బీహార్ కు చెందిన మొహమ్మద్ అష్ఫక్ రంజాన్ రోజాను విరమించాడు.. రెండు రోజుల ఆడ శిశువు ప్రాణాలను కాపాడడానికి. ఎస్ఎస్బి జవాన్ రమేష్ సింగ్ భార్య ఆర్తీ కుమారి దర్భంగా లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారికి వెంటనే రక్తం కావాల్సి వచ్చింది. అది కూడా ‘O నెగటివ్’ అది చాలా అరుదుగా దొరుకుతుంది. దీంతో ఆ శిశువు కుటుంబ సభ్యులు విషయాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే వెంటనే ఈ విషయాన్ని గమనించిన అష్ఫక్ కుటుంబసభ్యులను కాంటాక్ట్ చేశాడు.

అతడు ఆసుపత్రికి రాగానే వైద్యులు ఏమీ తినకుండా బ్లడ్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పారు. దీంతో అష్ఫక్ రంజాన్ ఉపవాస దీక్షను విరమించాల్సి వచ్చింది. డాక్టర్లు చెప్పినట్లుగా భోజనం చేసి చిన్నారికి వెంటనే రక్తం ఇచ్చాడు. ఈ విషయం మీడియాకు కూడా చేరింది. అష్ఫక్ చేసిన మంచి పనిని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. తనకు చిన్నారి ప్రాణాలు కాపాడడమే ఆ సమయంలో ముఖ్యమని అనిపించిందని.. అది కూడా భారత జవాన్ కూతురును కాపాడినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు అష్ఫక్. తాను రక్తం ఇచ్చే ముందు హిందూ.. ముస్లిం.. అనే వాటిని అసలు పట్టించుకోలేదని.. ఆ పాప బాగుంటే చాలని అష్ఫక్ తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here