ఇద్దరూ ఆడ‌పిల్ల‌లే పుట్టారు..ఆస్తిలో వాటా ఇవ్వ‌బోమంటూ అవ‌మానించిన త‌ల్లిదండ్రులు..దీని ఫ‌లితం?

ఇద్ద‌రూ ఆడ‌పిల్ల‌లే పుట్టారంటూ త‌ల్లిదండ్రులు, సొంత కుటుంబీకులే ఎద్దేవా చేశారు. ఆస్తిలో చిల్లిగ‌వ్వ కూడా ఇవ్వ‌బోమంటూ అవ‌మాన ప‌రిచారు. భూమిని విక్ర‌యించ‌గా.. వ‌చ్చిన డ‌బ్బులో ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదు. దీనితో తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడో వ్య‌క్తి.

తన త‌ల్లిదండ్రులు, తోడ‌బుట్టిన వాళ్లే అవ‌మానాల‌కు గురి చేస్తుండ‌టాన్ని త‌ట్టుకోలేక‌పోయాడు. భార్య, ఇద్ద‌రు కుమార్తెల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. షామీర్‌పేట్ పెద్ద‌మ్మ చెరువులో దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని మేడ్చ‌ల్ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన రమేశ్ పాల వ్యాపారి. అయిదేళ్ల‌ కింద‌ట ఆయనకు షామీర్‌పేట్‌ మండలం ఉద్దెమర్రి గ్రామానికి చెందిన మానసతో వివాహమైంది. వారికి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు. గీత‌శ్రీ‌, దివ్య‌శ్రీ‌. రెండోసారి కూడా ర‌మేశ్‌కు ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో త‌ల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఛీత్కారాలు ఎదుర‌య్యాయి.

మాన‌స‌కు కూడా ఆడపడుచుల నుంచి వేధింపులు తీవ్రం అయ్యాయి. ఇటీవ‌లే ర‌మేశ్ తండ్రి భూమిని విక్రయించ‌గా వ‌చ్చిన నగదులో ఒక్క రూపాయి కూడా ర‌మేశ్‌కు ఇవ్వ‌లేదు. ఆ సొమ్ము తనకు ఇచ్చేందుకు తల్లిదండ్రులు నిరాకరించడం, భార్యను వేధిస్తుండడం వంటి పరిణామాలతో మనస్తాపానికి గ‌ర‌య్యాడు.

సోమవారం మధ్యాహ్నం భార్య, పిల్లలతో సహా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. భార్యా, పిల్ల‌ల‌తో స‌హా పెద్దమ్మ చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పెద్ద‌మ్మ చెరువులో మృతదేహం క‌నిపించ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ విష‌యం ర‌మేశ్ అత్తామామ‌లు, వారి త‌ర‌ఫు బంధువులకు తెలిసింది.

వెంట‌నే.. వారు పెద్ద‌మ్మ చెరువు వ‌ద్ద‌కు చేరుకోగా.. చెప్పులు క‌నిపించాయి. చెరువులో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి.

దీనితో మాన‌స త‌ల్లిదండ్రులు విషాదంలో మునిగారు. ఆరునెల‌ల వ‌య‌స్సున్న దివ్య‌శ్రీ మృత‌దేహాన్ని చూసి.. బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. షామీర్‌పేట్ పోలీస్‌స్టేష‌న్‌లో ర‌మేశ్ త‌ల్లిదండ్రులు, కుటుంబీకుల‌పై కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here