మ‌ద్యం మ‌త్తు..ప‌ది అడుగుల‌కు పైగా ఎత్తున్న ఇంటి గేటు!

మ‌ద్యం మ‌త్తులో ఓ వ్య‌క్తి ప‌ది అడుగుల‌కు పైగా ఎత్తున్న ఇంటి గేటును దూక‌బోయి ప్రాణాల‌ను పోగొట్టుకున్నాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో చోటు చేసుకుంది. ఆనంద్‌ గోకుల్‌ శ్యామ్‌శర్మ అనే వ్య‌క్తి కొంతకాలంగా ధూల్‌పేట్‌లో నివ‌సిస్తున్నారు. వృత్తిరీత్యా ఆయ‌న కంసాలి. ఆయ‌న‌కు భార్య, ముగ్గురు పిల్లలు. వేసవి సెలవులు కావడంతో భార్య, పిల్లలు పుట్టింటికి వెళ్లారు.

భార్య‌, పిల్ల‌లు లేక‌పోవ‌డంతో.. అత‌ని బావ‌మరిది అభిషేక్ బావ‌తో క‌లిసి ఉంటున్నారు. శ్యామ్‌శ‌ర్మ‌కు మ‌ద్యం సేవించే అల‌వాటు ఉంది. రోజూలాగే మ‌ద్యం సేవించి, అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత 2 గంట‌ల స‌మ‌యంలో ఇంటికి చేరుకున్నారు. ప్ర‌ధాన‌గేటుకు లోప‌లి నుంచి తాళం వేసి ఉంది. ఆయ‌న బావ‌మరిది ఇంట్లో నిద్రిస్తున్నారు. ఆయ‌న‌ను నిద్ర లేప‌డానికి కాలింగ్‌ బెల్ నొక్కారు.

చాలాసేపు కాలింగ్‌బెల్ నొక్కిన‌ప్ప‌టికీ ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీనితో అభిషేక్‌కు ఫోన్ చేశారు. ఆ ప్ర‌య‌త్న‌మూ విఫ‌ల‌మైంది. దీనితో త‌న బైక్‌ను ప్ర‌ధాన గేటు వ‌ద్ద అడ్డంగా నిలిపి, దానిపై నుంచి గేటు దూక‌డానికి ప్ర‌య‌త్నించారు. పది అడుగులకుపైగా ఎత్తు ఉన్న ఆ ఇనుప గేటు పైన‌ చువ్వలు ఉన్నాయి.

గేటు దూకే స‌మ‌యంలో ఆ ఇనుప చువ్వ‌లకు శ్యామ్‌శ‌ర్మ చొక్కా చిక్కుకుంది. మ‌ద్యం మ‌త్తులో ఉండ‌టం, చొక్కా ఇనుప చువ్వ‌ల‌కు త‌గిలి ఊపిరి ఆడ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అంద‌రూ గాఢ‌నిద్ర‌లో ఉన్న స‌మ‌యంలో కావ‌డంతో ఆయ‌న కేక‌లు వేసిన‌ప్ప‌టికీ.. ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. అలాగే- ఆయ‌న మ‌ర‌ణించారు. తెల్ల‌వారు జామున 4:30 గంట‌ల స‌మ‌యంలో శ్యామ్‌శ‌ర్మ‌ పక్కింట్లో నివసించే గోపి అనే వ్యక్తి ఈ దృశ్యాన్ని చూసి, వెంట‌నే మంగ‌ళ్‌హాట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని త‌మ‌ వాహనంలోనే శ్యామ్‌శ‌ర్మ‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అత‌ని భార్య‌కు స‌మాచారం ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here