గుడి మెట్ల మీద బొచ్చెతో కొట్టుకున్న బిచ్చ‌గాళ్లు: క‌త్తిపోట్లు కూడా!

మైసూరు: గుడి మెట్ల ఇద్ద‌రు బిచ్చ‌గాళ్ల మ‌ధ్య త‌లెత్తిన గొడ‌వ క‌త్తి పోట్ల‌కు దారి తీసింది. మొద‌ట ఒక‌రినొక‌రు బొచ్చెతో కొట్టుకున్నారు. క‌సి తీర‌క‌.. క‌త్తి తీసుకుని కొట్లాడారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఓ బిచ్చ‌గాడు కత్తిపోట్ల బారిన ప‌డ్డాడు. అత‌నికి తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే అత‌ణ్ణి ఆసుప‌త్రికి త‌రలించారు.

అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మైసూరులో చోటు చేసుకుంది. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వకు కార‌ణం.. స్థ‌లం వివాదం! తాను రోజూ కూర్చుని బిచ్చ‌మెత్తే గుడి మెట్టు మీద..ఇంకో బిచ్చ‌గాడు వ‌చ్చి కూర్చోవ‌డ‌మే కార‌ణ‌మని పోలీసులు నిర్ధారించారు.

మైసూరు న‌గ‌రంలోని అగ్ర‌హార ప్రాంతంలో సాయిబాబా గుడి ఉంది. సాయిబాబా ద‌ర్శ‌నం కోసం రోజూ చాలామంది భ‌క్తులు వ‌స్తుంటారు. గురువారం రోజు భ‌క్తుల తాకిడి బీభత్సంగా ఉంటుంది.

గుడి మెట్ల వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో బారులు తీరి కూర్చుని ఉంటారు బిచ్చ‌గాళ్లు. గురువారం సాయంత్రం కొంద‌రు కొత్త బిచ్చ‌గాళ్లు సాయిబాబా గుడి వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఓ పాత బిచ్చ‌గాడు రోజూ కూర్చునే మెట్టు మీద తిష్ట వేశాడు.

అత‌ను వ‌చ్చే స‌రికి త‌న‌కు తెలియ‌ని కొత్త ముఖం త‌న స్థ‌లంలో తిష్ట వేయ‌డంతో గొడ‌వ ప‌డ్డాడు. ఇద్ద‌రి మ‌ధ్యా చెల‌రేగిన గొడ‌వ‌.. ఒక‌రినొక‌రు కొట్టుకునే స్థాయికి వెళ్లింది. బొచ్చెతో కుళ్ల‌బొడుచుకున్నారు ఇద్ద‌రు.

ఆగ్ర‌హం చ‌ల్లార‌క ఓ బిచ్చ‌గాడు క‌త్తితో ఇంకొక‌త‌ని మీద దాడి చేశాడు. క‌స‌క‌సా పొడిచేశాడు. బిత్త‌ర‌పోయిన భ‌క్తులు కేఆర్ పుర పోలీస్‌స్టేష‌న్‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే గుడి వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు ఒక‌రిని అరెస్టు చేశారు. త‌మ వెంట కారులో పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. గాయ‌ప‌డ్డ బిచ్చ‌గాడిని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here