ప‌రామ‌ర్శించ‌డానికి ఆసుప‌త్రికి వెళ్లాడు..రెండే నిమిషాల్లో ఎమ్మారై స్కానింగ్ మెషీన్‌లో ఇరుక్కుని..!

ఎమ్మారై స్కానింగ్ మెషీన్ గురించి తెలియ‌ని వారు దాదాపు ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంటి మెషీన్ ఓ మ‌నిషి ప్రాణాన్ని తీసిందంటే న‌మ్మ‌శ‌క్యం కాదు. నిజంగానే ఎమ్మారై స్కానింగ్ మెషీన్ ఓ యువ‌కుడి ప్రాణాల‌ను `లాగేసింది`.

ఎమ్మారై స్కాన్‌లో ఓ వృద్ధురాలికి సాయంగా వెళ్లిన ఆ యువ‌కుడు అందులో ఇరుక్కొని చనిపోయాడు. ముంబైలోని బీఐఎల్ నాయర్ చారిటబుల్ ఆసుప‌త్రిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతుడి పేరు రాజేష్ మారు. వృత్తిరీత్యా సేల్స్‌మెన్‌.

అనారోగ్యానికి గురైన త‌న స‌మీప బంధువొక‌రు బీఐఎల్ నాయ‌ర్ ఛారిట‌బుల్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలిసి, ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లాడు. ఆ మ‌హిళ‌కు ఎమ్మారై స్కానింగ్ చేయాల్సి ఉంది.

ఆమెను స్కానింగ్ మెషీన్ వ‌ద్ద‌కు తీసుకెళ్తున్న స‌మ‌యంలో స‌హాయం చేస్తూ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌ను వెంట తీసుకెళ్లాడు. నిజానికి- ఎమ్మారై స్కానింగ్ గ‌దిలో అయ‌స్కాంత శ‌క్తి అధిక స్థాయిలో ఉంటుంది.

అందుకే- ఆ గ‌దిలోకి వెళ్లే స‌మ‌యంలో అయ‌స్కాంతాన్ని ఆక‌ర్షించే వ‌స్తువులు, ఇత‌ర ప‌రిక‌రాల‌ను అనుమ‌తించ‌రు. ఆ మెషీన్ ఆఫ్ చేసి ఉంద‌ని వార్డ్‌బోయ్ చెప్ప‌డంతో.. రాజేష్ మారు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌ను ప‌ట్టుకెళ్లాడు.

అడుగు పెట్టిన మ‌రుక్ష‌ణ‌మే అక్క‌డి అయ‌స్కాంత శ‌క్తి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌ను ప‌ట్టుకుని ఉన్న రాజేష్‌మారును త‌న వైపున‌కు లాగేసింది. మొద‌ట అతని చేయి పూర్తిగా మెషీన్‌లో ఇరుక్కుపోయింది. అక్కడే ఉన్న రాజేష్ బంధువులు, వార్డు బోయ్స్ అతన్ని మెషీన్ నుంచి బయటకు తీశారు.

తీవ్ర రక్తస్రావమైన అత‌ణ్ణి వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించ‌గా.. అప్ప‌టికే ప్రాణాలు పోయిన‌ట్టు డాక్ట‌ర్లు చెప్పారు. మృతుడి బంధువు హ‌రీష్ సోలంకి ఫిర్యాదు మేర‌కు ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here