పిల్లాడ్ని ఇంటి పైక‌ప్పు దూలానికి వేలాడ‌దీసి..!

రాజ‌స్థాన్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ కిరాత‌కుడు త‌న ఇద్ద‌రు పిల్ల‌లను అతి దారుణంగా చిత‌క‌బాదాడు. అయిదేళ్ల కుమారుడిని తాడుతో ఇంటి పైక‌ప్పు దూలానికి వేలాడ‌దీసి మ‌రీ కొట్టాడు.

మూడేళ్ల కుమార్తెను కింద ప‌డేసి కాళ్ల‌తో త‌న్నాడు. క‌ర్ర‌తో కొట్టాడు. ఫుట్‌బాల్ ఆడుకున్నారు. రాజ‌స్థాన్‌లోని రాజ‌స‌మంద్ జిల్లాలో ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీని ఆధారంగా పోలీసులు ఆ రాక్ష‌స తండ్రిపై కేసు న‌మోదు చేశారు.

అత‌ని పేరు చెయిన్‌సింగ్‌. 32 సంవ‌త్స‌రాలు. చెడ్డీలో మూత్రం పోసుకోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. రాజ‌స‌మంద్ జిల్లాలోని దేవ‌గ‌ఢ్ తాలూకా ప‌రిధిలో ఉన్న ఫుకియాథ‌డ్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

అన్న‌ను కిరాత‌కంగా దూలానికి వేలాడ‌దీసి కొడుతున్న తండ్రిని చూసి.. కుమార్తె భ‌యంతో పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. ప‌ట్టుకుని మ‌రీ కొట్టాడు.

చెయిన్ సింగ్ సోద‌రుడు వాట్టాసింగ్ ఈ వీడియోను చిత్రీక‌రించాడు. ఈ నెల 28వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో బుధ‌వారం వెలుగులోకి వ‌చ్చింది.

అయిదేళ్ల కుమారుడి పేరు ల‌లిత్‌సింగ్‌. కుమార్తె పేరు లాజ్‌వంతి ఆలియాస్ పూజా. తాను విడిపించ‌డానికి ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ.. త‌న‌పైనా చెయ్యి చేసుకున్నాడ‌ని చెయిన్‌సింగ్ భార్య డోలి చెప్పారు.

ఈ వీడియో వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే ఆరా తీసిన పోలీసులు.. చెయిన్‌సింగ్‌, వీడియో తీసిన వాట్టాసింగ్‌ను అరెస్టు చేశారు. వారిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here