చిక్మగళూరు: పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తోన్న 12 సంవత్సరాల విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించాడో కామాంధుడు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలో చోటు చేసుకుంది. విద్యార్థిని పేరు శ్రీరక్ష. జిల్లాలోని కొప్ప తాలూకా కేసగోడు గ్రామానికి చెందిన శ్రీరక్ష ఆరో తరగతి చదువుతోంది.
రోజూలాగే శనివారం మధ్యాహ్నం కొప్పలోని ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఆటోలో కేసగోడు మార్గంలో దిగి, అటవీ బాట గుండా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆ బాలిక గట్టిగా కేకలు వేస్తూ, ప్రతిఘటించింది.
దీనితో ఆగ్రహించిన అతను రాయితో తలపై కొట్టి హత్య చేశాడు. మృతదేహాన్ని పొదల్లో పడేసి, ఇంటికెళ్లాడు. రక్తంతో తడిచిన దుస్తుల్లో ఆ యువకుడిని చూసిన గ్రామస్తులు కీడును శంకించారు.
హరిహరపుర పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన నేరాన్ని అంగీకరించాడు. శ్రీరక్ష మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రికి తరలించారు.