పెళ్ళికి వచ్చారు.. దగ్గరి బంధువుల్లా నటించారు.. పెళ్ళి కూతురు తాళిబొట్టు కొట్టేశారు.. ఆ తర్వాత..!

మనం ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం.. కొందరు దొంగలు పెళ్ళిళ్ళను టార్గెట్ చేసి.. అందరికీ బంధువుల్లా నటిస్తారు. ఆ తర్వాత ఉన్నదంతా దోచేసుకొని చెక్కేస్తుంటారు. అయితే ఇక్కడ ఏకంగా తాళిబొట్టును కూడా కొట్టేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.


నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డి గ్రామంలో ఓ పెళ్లి జరుగుతోంది. హైదరాబాద్‌ నుంచి ముగ్గురు మహిళలు, కారు డ్రైవర్‌ ఆ వివాహవేడుకకు వచ్చారు. వాళ్ళు చేసిన హడావుడి చూసి నిజంగా పెళ్ళి కూతురు బంధువులేమో అని అనుకున్నారు ప్రతి ఒక్కరూ..! కానీ వాళ్ళు దొంగలని.. వాళ్ళ ప్లాన్ వేరేది ఉందని అసలు గ్రహించలేకపోయారు. అప్పటికే పెళ్ళికి వచ్చిన బంధువుల వద్ద బాగానే నొక్కేసిన వీళ్ళ కళ్ళు చివరికి తాళిబొట్టు మీద కూడా పడింది. ఇంకేముంది క్షణాల్లో చాకచక్యంగా తాళిబొట్టును లేపేశారు. అది కూడా ఎలాగో తెలుసా వధువు మెడలో వేసిన పూల దండను సర్దినట్లు సర్ది తాళిబొట్టును కొట్టేశారు.

కొద్ది సేపటికి పెళ్లి కూతురు తన మెడలో మంగళసూత్రం లేదని గ్రహించింది. వెంటనే తల్లిదండ్రులకు చెప్పడంతో దొంగల పనే అని గ్రహించారు. అంతేకాకుండా ఆ సమయానికి ఇందాకా సందడి చేసినవారంతా అక్కడ లేకుండా పోయారు. అప్పటికే ఈ దొంగ బ్యాచ్ అంతా కారులో జంప్ అయిపోయారు. కొద్ది దూరం పాటూ వాళ్ళను వెంటాడి పట్టుకున్నారు గ్రామస్థులు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందుకే పెళ్ళిలో ఎవరు మనవాళ్ళో.. ఎవరు అవతలివాళ్ళో గమనిస్తూ ఉండాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here