తుమ్ము వస్తే తుమ్మేయండి.. అలా ఆపుకోవడం వలన ఏడు రోజులు ఆసుపత్రిలో గడిపాడు..!

పదిమందిలో తుమ్మడానికి కొందరు తెగ భయపడతారు.. అలాగని ఆపుకోగలరా అంటే ఆపుకోలేరు. విశ్వ ప్రయత్నాలు చేసి ఆపుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం అది తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. తుమ్ము ఆపుకోవడం వల్ల గొంతు లోపల గాయం కావచ్చు, చెవిలో ఉండే కర్ణభేరి పగిలిపోవచ్చు, లేదా మెదడులో ఉండే నరాలు ఉబ్బిపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. తుమ్మును ఆపుకున్నందువల్ల ఊపిరితిత్తుల మధ్య కొంత గాలి చొరబడి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడుతుందన్నారు. ఒక్కోసారి మెదడులో రక్తనాళాలు ఉబ్బిపోతాయట..!

బ్రిటీష్ వ్యక్తి చాప్ అలా తుమ్ము ఆపాలని ప్రయత్నించగా అతడి గొంతులో ఓ చిన్నపాటి రంధ్రం ఏర్పడింది. కొన్ని సంవత్సరాలుగా అతడు తుమ్ములను ఆపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడట. దీనిపై డాక్టర్లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి తుమ్ము వస్తుండగా ఆపాలని ప్రయత్నించి ముక్కు మూసుకున్నాడు. ఆ తుమ్ము వచ్చిన వేగానికి అతడు అడ్డుపెట్టడంతో గొంతులో ఓ చిన్న రంధ్రం ఏర్పడింది. దీంతో అతడు ఏది కూడా మింగలేకపోయేవాడు.. అలాగే కనీసం మాట్లాడనుకూడా మాట్లాడలేకపోయాడు. దీంతో లీసెస్టర్ లో ఉన్న ఆసుపత్రికి వెళ్ళాడు. డాక్టర్లు అతడికి యాంటీబయాటిక్స్ అందించారు.

టోమోగ్రఫీ నిర్వహించగా అతడి గొంతులో రంధ్రం పడడానికి ముఖ్య కారణం తుమ్ము ఆపుకోవడమేనని గుర్తించారు. దాదాపు వారం రోజుల పాటూ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత బయటకు వచ్చాడు. ప్రస్తుతం కాస్త మెత్తటివి తినగలుగుతున్నాడు. చాలా ఏళ్ళుగా తాను తుమ్ములను ఆపుకుంటున్నానని చాప్ చెప్పుకొచ్చాడు. వేరే వాళ్ళ ముందు తుమ్మడం తాను పద్ధతి కాదని భావించేవాడినని అందుకే తుమ్మడం ఆపాలని అనుకునేవాడినని చెప్పాడు. తుమ్ము బలానికి అతడి గొంతు వెనక వైపు తీవ్రమైన గాయం కావడంతో పాటు నరాలు కూడా ఉబ్బాయి. అందుకే ఎట్టి పరిస్థితి లోనూ తుమ్ము ఆపుకోకండి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here