పార్కుల్లో ప్రేమ ప‌క్షుల గోల‌: క‌ట్ట‌డి చేయ‌డానికి భ‌లే కండిష‌న్ పెట్టార్లే!

పార్కుల‌కు ఎందుకెళ్తాం? కాస్త ప్రశాంత‌త కోసం. వాకింగ్ కోస‌ము, జాగింగ్ కోస‌మూనూ. వెళ్లిన ప్ర‌తి పార్కులోనూ ప్రేమ ప‌క్షుల గోల అధికంగా ఉంటే మ‌న‌స్సంతా ఏదోలా అయిపోతుంది.

ప్ర‌శాంత‌త కాస్త అశాంతికి దారి తీస్తుంది. దీన్ని నిరోధించ‌డానికి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం భ‌లే కండిష‌న్ పెట్టింది. యువ‌తి, యువ‌కులు పార్కులో అడుగు పెట్టాలంటే.. మ్యారేజ్ స‌ర్టిఫికెట్ చూపించాల్సిందే.

సింగిల్ గా వస్తే ఆధార్ కార్డ‌యినా ఉండాలి. లేక‌పోతే.. తూర్పు తిరిగి దండం పెట్టండంటారు అక్క‌డి సిబ్బంది. ఈ త‌ర‌హా కండీష‌న్‌ను అమ‌లు చేసిన ఘ‌నత త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో ఉన్న బొటానిక‌ల్ గార్డెన్స్‌కు ద‌క్కుతుంది.

మ్యారేజ్ స‌ర్టిఫికెట్ చూపిస్తేనే బొటానిక‌ల్ గార్డెన్స్‌లో ప్ర‌వేశించ‌డానికి టికెట్ ఇస్తారు. లేదంటే ఇవ్వ‌రు. కోయంబ‌త్తూరు మరుథ‌మాలియా రోడ్డులో ఉంది ఈ బొటానిక‌ల్ గార్డెన్స్‌.

దీని నిర్వ‌హ‌ణ బాధ్య‌త త‌మిళ‌నాడు వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యానిది. అందంగా, అద్భుతంగా ఉంటుందీ పార్కు. అందుకే ప్రేమ ప‌క్షులు ఎప్పుడూ ఈ పార్కుల్లో చ‌క్క‌ర్లు కొడుతుంటాయి.

చెట్ల వెనుక‌, పుట్ల వెనుకా మాటు వేసి, అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు తెర తీస్తుంటాయి. దీన్ని నియంత్రించ‌డానికే ఈ నిబంధ‌న‌ను తీసుకొచ్చారు వ‌ర్శిటీ అధికారులు.

ఈ బొటానికల్ గార్డెన్‌కు కాలేజీ విద్యార్థులు ఎక్కువ‌గా వస్తున్నారు. పార్క్‌లో ఎక్క‌డ చూసినా ప్రేమ జంటలే. కాలేజీలంకు బంక్ కొట్టి మ‌రీ పార్క్‌లో షికారు చేస్తున్న‌ట్లు ఫిర్యాదులు కూడా అందాయి.

దీనితో ఈ నిబంధ‌న‌ను తీసుకొచ్చిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. పార్క్ లోకి జంటలు రావాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన పెట్టారు.

సింగిల్ గా వస్తే ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంది. ప‌నిలో ప‌నిగా ఫోన్ నంబ‌ర్ కూడా ఇవ్వాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here