పెళ్ల‌యిన 15 ఏళ్ల‌కు తొలిసారిగా విహారానికి దుబాయ్‌కు వెళ్లారు..రోడ్డు ప్ర‌మాదంలో!

పెళ్ల‌యిన 15 సంవ‌త్స‌రాల త‌రువాత తొలిసారిగా ఆ దంప‌తులు విహారం కోసం దుబాయ్‌కు వెళ్లారు. దుబాయ్‌లో విమానం దిగారు. త‌మకు ఇష్ట‌మైన ప్ర‌దేశాల‌న్నీ చూశారు. మ‌రో రెండు, మూడు రోజుల్లో స్వ‌దేశానికి తిరిగి రావాల్సి ఉన్న త‌రుణంలో.. రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు.

భ‌ర్త సంఘ‌ట‌నాస్థ‌లంలోనే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. భార్య మాత్రం సుమారు రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి.. తుదిశ్వాస విడిచారు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న దుబాయ్‌లో చోటు చేసుకుంది. మృతుల పేర్లు దినేష్ క‌వ‌డ్‌, నీతూ జైన్ క‌వ‌డ్‌. క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారికి చెందిన దినేష్ క‌వ‌డ్‌కు 15 సంవ‌త్స‌రాల కింద‌ట నీతూ జైన్‌తో వివాహ‌మైంది.

అత‌ను స్థానికంగా వ‌స్త్రాల వ్యాపారి. వారికి 11 సంవ‌త్స‌రాల కుమారుడు ఉన్నాడు. పెళ్ల‌యిన త‌రువాత తొలిసారిగా దుబాయ్‌కు వెళ్లారు. అక్క‌డ ఎడారిలో ప‌ర్య‌టించ‌డానికి వెళ్తుండ‌గా.. వారు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది. ముందు సీట్లో కూర్చున్నారు. ఆయ‌న భార్య నీతూ జైన్ వెనుక సీట్లో ఉన్నారు.

ప్ర‌మాదం సంభ‌వించిన వెంట‌నే దినేష్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. పాకిస్తాన్ జాతీయుడైన డ్రైవ‌ర్‌తో పాటు, నీతూ జైన్ గాయ‌ప‌డ్డారు. నీతూ త‌ల‌కు తీవ్ర గాయ‌మైంది. ఆమెను ర‌షీద్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దినేష్ క‌వ‌డ్ మృత‌దేహాన్ని బ‌ళ్లారికి త‌ర‌లించారు. ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే దినేష్ సోద‌రుడు దుబాయ్‌కు వెళ్లారు.

రెండు వారాల త‌రువాత కూడా నీతూ ఆరోగ్యం మెరుగుప‌డ‌క‌పోవ‌డంతో ఆమెను ఎయిర్ అంబులెన్స్ ద్వారా బెంగ‌ళూరుకు త‌ర‌లించారు. దుర‌దృష్ట‌వ‌శావ‌త్తూ ఆమె ఎయిర్ అంబులెన్స్‌లోనే మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌తో వారి కుమారుడు అనాథ‌గా మారాడు. త‌ల్లిదండ్రుల‌తో పాటు అత‌ను దుబాయ్‌కు వెళ్ల‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here