160 కిలోమీట‌ర్ల వేగంతో డ్యూక్ బైక్‌! ర‌హ‌దారిపై చిన్న మ‌లుపు! బైక్ ఓ చోట‌..డెడ్‌బాడీ మ‌రోచోట‌!

పెద్ద‌గా వాహ‌న సంచారం లేకుండా ఖాళీగా క‌నిపిస్తోన్న జాతీయ ర‌హ‌దారి. చేతిలో డ్యూక్ బైక్. దీనికంటే కావాల్సిందేముంది. స్పీడ్‌ను త‌గ్గించ‌డానికి మ‌న‌సు అంగీక‌రించ‌లేదు. గాలితో పోటీ ప‌డుతున్న‌ట్టు బైక్‌ను న‌డిపించాడా యువ‌కుడు. ఆవారాగా, అల్లాట‌ప్పాగా తిరిగే కుర్రాడేమీ కాదు. జూనియ‌ర్ డాక్ట‌ర్‌.

ఎంబీబీఎస్ చివ‌రి సంవ‌త్స‌రం విద్యార్థి. 140-160 కిలోమీట‌ర్ల వేగంతో జాతీయ ర‌హ‌దారిపై దూసుకెళ్తోన్న ఆ బైక్‌..ఓ చోట మ‌లుపులో అదుపు త‌ప్పింది. అంతే! ఏ మాత్రం బైక్‌ను నియంత్రించ‌లేక‌పోయాడా యువ‌కుడు. సినిమాల్లో చూపించిన‌ట్టు స‌ర్రుమంటూ జారుకుంటు వెళ్లి, డివైడ‌ర్‌ను ఢీ కొట్టి, గాల్లోకి ఎగిరి రోడ్డు ప‌క్క‌న ప‌డిపోయింది.

నేరుగా డివైడ‌ర్‌ను ఢీ కొట్ట‌డంతో ఆ యువ‌కుడి త‌ల ఛిద్ర‌మైంది. స్పాట్ డెడ్‌. బైక్ ఒక‌చోట‌, డెడ్ బాడీ మ‌రోచోట‌. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి పేరు వినోద్ దొడ్డ‌మ‌ని. వ‌య‌స్సు 22 సంవ‌త్స‌రాలే. ప్ర‌తిష్ఠాత్మ‌క బీద‌ర్ వైద్య క‌ళాశాల విద్యార్థి.

ఎంబీబీఎస్ చివ‌రి సంవ‌త్సం చుదువుతున్న వినోద్ స్వ‌స్థ‌లం.. పొరుగునే ఉన్న విజ‌య‌పుర జిల్లా సింద‌గి. బీద‌ర్‌లో హాస్ట‌ల్‌లో ఉంటూ ఎంబీబీఎస్ చ‌దువుతున్నాడు. విషాద‌క‌రం ఏమిటంటే- ఆ బైక్ అత‌నిది కూడా కాదు. అత‌ని స్నేహితుడిది. హాస్ట‌ల్‌లో ఉండే స్నేహితుడి డ్యూక్ బైక్ తీసుకుని ఓ రౌండ్ కొట్టొస్తాన‌ని చెప్పి, తీసుకెళ్లాడు.

బీద‌ర్ ఔట‌ర్ రింగ్ జాతీయ రహ‌దారిపై బెన‌క‌న‌హ‌ల్లి మార్గంలో అతి వేగంగా బండిని న‌డిపించాడు. మ‌లుపులో అదుపు త‌ప్పి, కింద‌ప‌డి మ‌ర‌ణించాడు. మ‌రి కొన్ని నెల‌ల్లో ఎంబీబీఎస్‌ను పూర్తి చేసుకుని, డాక్ట‌ర్ అయి ఇంటికి తిరిగి వ‌స్తాడ‌ని ఆశించిన త‌ల్లిదండ్రులు.. త‌మ కుమారుడి మృత‌దేహాన్ని చూసి కుప్ప‌కూలిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై బీద‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here