బ్యాంకు వ‌ద్ద ఓ వ్య‌క్తి చేతిలో ఉన్న ప్లాస్టిక్ క‌వ‌ర్‌ను లాక్కెళ్లిన కోతి..అందులో డ‌బ్బే డ‌బ్బు!

బ్యాంకులో డిపాజిట్ చేయ‌డానికి తీసుకెళ్తున్న డ‌బ్బు కోతుల పాలైన ఘ‌ట‌న ఇది. మ‌రికొన్ని క్ష‌ణాల్లో ఆ వ్య‌క్తి బ్యాంకులో అడుగు పెడ‌తాడ‌న‌గా.. కోతుల గుంపు ఒక‌టి ఆయ‌న‌ను చుట్టుముట్టింది. నోట్ల క‌ట్ట‌లు దాచుకున్న ప్లాస్టిక్ క‌వ‌ర్‌ను ఎత్తుకెళ్లింది. అందులో ఉన్న న‌గ‌దు అక్ష‌రాలా రెండు లక్ష‌ల రూపాయ‌లు.

ఆ కోతిని అదిరించో, బెదిరించో 60 వేల రూపాయ‌ల‌ను మాత్రమే అత‌ను రిక‌వ‌రీ చేసుకోగ‌లిగాడు. మిగిలిన డ‌బ్బుతో చెట్ల చిటారు కొమ్మ‌ల మీదుగా దూకుతూ ఎటో వెళ్లిపోయిందా వాన‌రం. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. బాధితుడి పేరు విజ‌య్ బ‌న్స‌ల్‌. ఆగ్రాలోని రావ్లీలో ప్రాంతంలో ఆయ‌న జ్యువెల‌రీ షాప్‌ను నిర్వ‌హిస్తున్నారు.

17 సంవ‌త్స‌రాల త‌న కుమార్తె న్యాన్సీతో క‌లిసి మంగ‌ళ‌వారం ఉద‌యం ఆగ్రాలోని నాయీ కీ మండీ ప్రాంతంలో ఉన్న ఇండియ‌న్ ఓవ‌ర్‌సీస్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయ‌డానికి ఆ మొత్తాన్ని తీసుకెళ్తుండ‌గా.. ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బ్యాంకు వ‌ద్ద త‌న వాహ‌నాన్ని పార్క్ చేసి, కిందికి దిగిన వెంట‌నే కోతులు చుట్టుముట్టాయ‌ని, ఓ కోతి ప్లాస్టిక్ క‌వ‌ర్‌ను లాక్కుని వెళ్లిపోయింద‌ని అన్నారు.

చూస్తుండగానే.. అది ఓ భ‌వ‌న స‌ముదాయం పై అంత‌స్తుకు చేరింద‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న చూసిన వెంట‌నే బ్యాంకు గార్డు స‌హా ఇత‌రులు కోతిని అదిలించ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆ స‌మ‌యంలో ఆ క‌వ‌ర్‌లో నుంచి 60 వేల రూపాయ‌ల న‌గ‌దు కింద పడింది. మిగిలిన డ‌బ్బుల‌తో ఉన్న క‌వ‌ర్‌ను తీసుకుని, ఉడాయింది. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న పోలీసుల‌ను నాయీ కీ మండి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ట్విస్ట్ ఏమిటంటే- ఏ సెక్ష‌న్ కింద‌, ఎవ‌రి మీద కేసు పెట్టాలో తెలీక పోలీసులు బుర్ర గోక్కున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here