ఎన్నిక‌లొచ్చేశాయ్‌..ఇక వీటికి లోటేముంది!

రాయ‌చూరు: ఎన్నిక‌లొచ్చేశాయ్‌. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఇన్నాళ్లూ పెద్ద‌గా ప‌ట్టించుకున్నారో, లేదో తెలీదు గానీ.. ఇప్పుడు మాత్రం ఓట‌ర్లే దేవుళ్లు. ఈ ఓట‌రు దేవుళ్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డ‌మే నాయ‌కుల త‌క్ష‌ణ క‌ర్తవ్యం. ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే నైవేద్యం కావాలిగా? అందుకే- విచ్చ‌ల‌విడిగా మందు బాటిళ్ల‌ను స‌ర‌ఫ‌రా చేసేస్తున్నారు.

మ‌ద్యం తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అనే స్లైడ్స్‌, యాడ్స్‌.. సినిమాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన‌ద‌నే విష‌యం మ‌న‌కు తెలియ‌నిది కాదు. అద‌లావుంచితే.. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో మ‌ద్యం ఏరులై పారుతోంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోలో ఆ ఏరులోని ఓ పాయ మాత్ర‌మే.

క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూరులో దొరికిన మ‌ద్యం బాటిళ్లు అవి. అక్ర‌మంగా త‌ర‌లిస్తోన్న మ‌ద్యాన్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. పెద్ద ఎత్తున మ‌ద్యం బాటిళ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ అయిదు లక్ష‌ల రూపాయ‌ల పైమాటేన‌ట‌. వ‌చ్చేనెల 12వ తేదీన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌.

ఈ లోగా ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి నాయ‌కులు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. మొన్న‌టికి మొన్న ఓ నాయ‌కురాలు త‌న పేరును అచ్చేయించుకుని మ‌రీ కుక్క‌ర్ల‌ను పంపిణీ చేశారు. చీరెలు, సారెలు, ముక్కుపుడ‌క‌లు..య‌థాశ‌క్తి పంచుతూ దొరికిపోతున్నారు నాయ‌క‌గ‌ణం. అందులో ఓ భాగ‌మే ఇదీనూ.

ప‌క్కా స‌మాచారం అంద‌డంతో పోలీసులు దాడి చేసి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. 300 బాక్సుల్లో 2,592 లీట‌ర్ల విస్కీ, రెండు టాటా ఏస్ వాహ‌నాలను స్వాధీనం చేసుకున్నారు. ముత్తు, స‌ద్దాం అనే ఇద్ద‌ర్నీ అరెస్టు చేశారు. బాగ‌ల్‌కోటె-బొమ్మ‌నాళ్ మార్గ‌మ‌ధ్యలో ఈ వాహ‌నాలు పోలీసుల చేతికి చిక్కాయి. ఈ ఘ‌ట‌న‌పై ముద‌గ‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here