కూతుర్ని చంపి..ఒంట్లో బాగోలేదంటూ ఆసుప‌త్రిలో వ‌దిలి వెళ్లింది!

ముంబై: ముంబైలోని ఘ‌ట్‌కోప‌ర్ ఈస్ట్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మూడేళ్ల వ‌య‌స్సున్న త‌న కుమార్తెను చంపిందో కిరాత‌క త‌ల్లి. అనంత‌రం..పాప‌కు ఒంట్లో బాగోలేదంటూ ఆసుప‌త్రికి తీసుకెళ్లింది. న‌ర్సుల చేతిలో పాప‌ను ఉంచి ఉడాయించింది. ఆ మ‌హిళ పేరు నాద్రా షేక్‌. 22 సంవ‌త్స‌రాలు.

ఘ‌ట్‌కోప‌ర్ ఈస్ట్ ప్రాంతంలోని శివాజీ న‌గ‌ర్‌లో భ‌ర్త‌తో క‌లిసి నివ‌సిస్తోంది. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె భ‌ర్త వృత్తిరీత్యా బిహార్‌కు వెళ్లాడు. గురువారం సాయంత్రం నాద్రా షేక్ త‌న కుమారుడి ఎదుటే.. కుమార్తెను తీవ్రంగా కొట్టింది. ఆ దెబ్బ‌ల‌కు త‌ట్టుకోలేక.. ఆ చిన్నారి క‌న్నుమూసింది. వెంట‌నే పాప‌ను తీసుకుని రాజ్‌వాడి ఆసుప‌త్రికి వెళ్లింది.

క‌డుపునొప్పితో పాప బాధ‌ప‌డుతోంద‌ని చెప్పింది. గ‌తంలో కూడా వైద్యం చేయించాన‌ని, వాటికి సంబంధించిన ప్రిస్కిప్ష‌న్ ఇంట్లో ఉంద‌ని, దాన్ని తీసుకొస్తాన‌ని వెళ్లిపోయింది. ఇక మ‌ళ్లీ ఆమె ఆసుప‌త్రికి రాలేదు. పాప‌ను ప‌రిశీలించిన డాక్ట‌ర్లు ఆమె మ‌ర‌ణించిన‌ట్లు గుర్తించారు.

వెంట‌నే శివాజీ న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆసుప‌త్రికి చేరిన పోలీసులు పాప మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాద్రా షేక్ కుమారుడిని ప్ర‌శ్నించ‌గా.. త‌న క‌ళ్ల ముందే త‌ల్లి చెల్లెల్ని కొట్టిన‌ట్టు చెప్పాడు. ప‌రారీలో ఉన్న నాద్రాపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆమె కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here