రోడ్డు దాటుతున్న యువ‌తిని ఢీకొట్టిన బైక్‌: టీ ష‌ర్ట్ ఇరుక్కుని..100 మీట‌ర్ల పాటు ఈడ్చుకెళ్లి..!

ముంబైలో చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్ర‌మాదంలో 19 సంవ‌త్స‌రాల విద్యార్థిని మృతి చెందారు. ఆమె మృతి చెందిన తీరు అత్యంత విషాద‌క‌రం. త‌న స్నేహితుడితో క‌లిసి ఆమె రోడ్డు దాటుతుండ‌గా.. అత్యంత వేగంగా వ‌చ్చిన బైక‌ర్ ఆమెను ఢీ కొట్టాడు.

ఆ ప్ర‌మాద తీవ్ర‌త‌కు ఆమె ధ‌రించిన టీ ష‌ర్ట్‌.. బైక్ చ‌క్రాల్లో ఇరుక్కుపోయింది. అతి వేగం వ‌ల్ల బైక‌ర్‌.. త‌న బైక్‌ను నియంత్రించుకోలేక‌పోయాడు. బైక్ సుమారు వంద అడుగుల వ‌ర‌కూ ముందుకెళ్లింది.

టీ ష‌ర్ట్ చిక్కుకుపోవ‌డంతో బైక్ ఆ విద్యార్థినిని కూడా ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఆమె త‌ల అయిదుసార్ల‌కు పైగా డివైడ‌ర్‌ను ఢీ కొట్టిన‌ట్టు ప్ర‌త్య‌క్ష‌సాక్షులు చెబుతున్నారు.

ఈ ఘ‌ట‌న‌లో త‌ల‌కు తీవ్ర‌గాయం కావ‌డంతో ఆమెను లీలావ‌తి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. మృతురాలి పేరు గిరిజా అంబాలా.

ముంబైలోని కేబీపీ హిందుజా క‌ళాశాల విద్యార్థిని ఆమె. ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ చ‌దువుతున్నారు. ఆదివారం రాత్రి 9:30 గంట‌ల స‌మ‌యంలో త‌న స్నేహితుడు కునాల్ సురేంద్ర వైద్య‌తో క‌లిసి ముంబై వ‌ర్లీ స‌ముద్ర తీరం వ‌ద్ద రోడ్డు దాటుతుండ‌గా..ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

ప్ర‌మాద స‌మ‌యంలో బైక్‌పై ముగ్గురు ఉన్న‌ట్టు స్థానికులు చెప్పారు. ముగ్గురూ ప‌రార‌య్యారు. ఫిబ్ర‌వ‌రి 1న ఆమె పుట్టిన‌రోజు అని తండ్రి విల‌పిస్తూ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here