నిత్యం రైల్వేస్టేష‌న్‌లో ఉండే పోర్ట‌ర్లు..రైలుకు బ‌లి!

ముంబై: స‌బ‌ర్బ‌న్ రైలు ఢీ కొని ఇద్ద‌రు రైల్వే పోర్ట‌ర్లు దుర్మ‌ర‌ణం పాలైన ఘ‌ట‌న ముంబై స‌మీపంలోని వ‌సై రైల్వేస్టేష‌న్ వ‌ద్ద చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో పోర్ట‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆయ‌న ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. మంగ‌ళ‌వారం రాత్రి 8:30 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ప‌ట్టాల‌పై క‌ద‌ల్లేని స్థితిలో ప‌డి ఉన్న ఓ వ్య‌క్తికి స‌ప‌ర్య‌లు చేసే స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో ర‌ద్దీగా ఉన్న స‌బ‌ర్బ‌న్ రైలు నుంచి పంగ‌టి రాజా నాయుడు అనే 66 సంవ‌త్స‌రాల వృద్ధుడు పొర‌పాటున కింద ప‌డ్డారు. ఆయ‌న‌కు గాయాల‌య్యాయి. ఈ విష‌యాన్ని వ‌సై రైల్వేస్టేష‌న్‌లో మైక్ ద్వారా వెల్ల‌డించారు.

గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని స్టేష‌న్‌కు తీసుకుని రావ‌డానికి రామ్‌విలాస్ పాశ్వాన్‌, హ‌రిరామ్ రాజ్‌భ‌ర్ అనే ఇద్ద‌రు పోర్ట‌ర్లు స్ట్రెచ‌ర్‌ను తీసుకుని సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. వ‌సై రోడ్‌ స్టేష‌న్ మాస్ట‌ర్ మ‌నోజ్ చ‌వాన్‌, ఇద్ద‌రు రైల్వే పోలీసులు, డాక్ట‌ర్ వారి వెంట వెల్లారు. ప‌ట్టాల‌పై ప‌డ్డ రాజా నాయుడును స్ట్రెచ‌ర్‌పై ఎక్కించ‌సాగారు.

అదే స‌మ‌యంలో విరార్ నుంచి బ‌య‌లుదేరిన ఓ లోక‌ల్ రైలు వేగంగా అటుగా వ‌చ్చింది. రైలు రాకను ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు. చివ‌రి నిమిషంలో రైలును చూసిన డాక్ట‌ర్‌, స్టేష‌న్ మాస్ట‌ర్‌, ఇద్ద‌రు రైల్వే పోలీసులు త‌ప్పించుకున్నారు. రామ్‌విలాస్ పాశ్వాన్‌, హ‌రిరామ్‌ల‌ను హెచ్చ‌రించే స‌మ‌యానికే జ‌ర‌గాల్సిన ఘోరం జ‌రిగిపోయింది.

రైలు వారిద్ద‌రినీ ఢీ కొట్టింది. వారిద్ద‌రూ రైలు కిందికి వ‌చ్చేశారు. అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. చివ‌రి నిమిషంలో ప‌క్క‌కు దూకిన ఘ‌ట‌న‌లో స్టేష‌న్ మాస్ట‌ర్ కాలు విరిగింది. అత‌ణ్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై వ‌సై రోడ్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here