అజ్ఞాత‌వ్య‌క్తి: అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత వస్తాడు..అన్నీ త‌గులబెట్టి వెళ్తాడు.!

క‌ర్ణాట‌క‌లోని మైసూరు న‌గ‌రంలో కొద్దిరోజులుగా ఓ మిస్ట‌రీ మ్యాన్ పోలీసుల‌కు స‌వాల్ విసురుతున్నాడు. అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత జ‌న‌సంచారం లేని ప్రాంతాల‌కు వెళ్ల‌డం, అక్క‌డున్న ఫ్లెక్సీలు, హోర్డింగులు, సైన్‌బోర్డులు త‌గులబెట్ట‌డం..ఎంచ‌క్కా వెళ్లిపోవ‌డం ఇదీ ఆ వ్య‌క్తి చేసే ప‌ని.

కాలిపోయిన ఫ్లెక్సీలు, సైన్‌బోర్డుల‌ను చూసి.. వాటి య‌జ‌మానులు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ఇప్ప‌టిదాకా ప‌దుల సంఖ్య‌లో ఫిర్యాదులు అందాయి.

ఆ అజ్ఞాత‌వ్య‌క్తి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఫ్లెక్సీల‌ను తగుల‌బెడుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ‌యిన‌ప్ప‌టికీ.. ఆ వ్య‌క్తిని మాత్రం పోలీసులు గుర్తు ప‌ట్ట‌లేక‌పోతున్నారు.

మైసూరు టీకే లేఅవుట్‌లో ఉన్న అధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెక్నాల‌జీ కార్యాల‌యం హోర్డింగులు, ఫ్లెక్సీల‌ను త‌గుల‌బెట్టింది కూడా ఆ వ్య‌క్తేన‌ని తేలింది.

అధ్యాయ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఫ్లెక్సీల‌ను ఎక్కువ‌గా టార్గెట్‌గా చేసుకోవ‌డం వ‌ల్ల ఆ కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. బుధ‌వారం తెల్ల‌వారు జామున 4:30 గంట‌ల స‌మ‌యంలో కూడా అదే ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఫ్లెక్సీల‌ను కాల్చివేశాడు.

ఫ‌లితంగా.. ఆ ప్రాంతంలో చిన్న‌పాటి అగ్నిప్ర‌మాదం కూడా చోటు చేసుకుంది. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు మంట‌ల‌ను చూసి.. ఆర్పివేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ఆరంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here