క‌న్న‌తండ్రే కుమార్తెకు విషం ఇచ్చి చంపాడు! బ‌తుకుతుంద‌నే అనుమానంతో ఉరి వేసి, కిరోసిన్ పోసి!

మైసూరు: వేరే కులానికి చెందన యువ‌కుడిని ప్రేమిస్తోన్న క‌న్న కుమార్తెను దారుణంగా క‌డ‌తేర్చాడో కిరాత‌క తండ్రి. మొద‌ట ఆమెకు విషం ఇచ్చి చంపాడు. ఎక్క‌డ బతుకుతుందో అనే అనుమానంతో ఉరి వేసి, ఆ త‌రువాత కిరోసిన్ పోసి మ‌రీ త‌గులబెట్టాడు.

 

ఈ పైశాచిక ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మైసూరు జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు సుష్మ. జిల్లాలోని హెచ్‌డీ కోటె స‌మీపంలోని గొల్ల‌న‌బీడు గ్రామానికి చెందిన సుష్మ అదే తాలూకా ప‌రిధిలోని ఆల‌న‌హ‌ళ్లి గ్రామానికి చెందిన ఓ యువ‌కుడిని ఏడాదిగా ప్రేమిస్తోంది. ఈ విష‌యం ఆమె తండ్రి కుమార్‌కు తెలిసింది.

ఆ యువ‌కుడు వేరే కులానికి చెందిన వారు కావ‌డంతో కుమార్తెపై ఆంక్ష‌లు విధించాడు. కాలేజీ మాన్పించాడు. అయిన‌ప్ప‌టికీ.. సుష్మ త‌ర‌చూ ఆ యువ‌కుడిని క‌లుసుకుంటుండ‌టంతో క‌న్న కుమార్తెను క‌డ‌తేర్చాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

కింద‌టి నెల 21వ తేదీన బైక్‌పై సుష్మ‌ను త‌న పొలానికి తీసుకెళ్లాడు. అక్క‌డే ఆమెకు తెలియ‌కుండా అన్నంలో పురుగుల మందు క‌లిపి ఇచ్చాడు. దాన్ని తిన్న సుష్మ సంఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించింది.

అయిన‌ప్ప‌టికీ.. ఆమె ఎక్క‌డ బ‌తుకుతుంద‌నే అనుమానంతో చెట్టుకు ఉరి వేశాడు. గంట త‌రువాత మృత‌దేహాన్ని కిందికి దించి, కిరోసిన్ పోసి హ‌త‌మార్చాడు. సుష్మ మృత‌దేహం పూర్తిగా కాలిపోయింది. ఎముక‌లు కూడా మిగ‌ల్లేదు.

ఈ ఘ‌ట‌న‌పై జిల్లా ఎస్పీ కార్యాల‌యానికి ఓ ఆకాశ‌రామ‌న్న ఉత్త‌రం అందింది. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించ‌డంతో అస‌లు విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న కుమార్తెను తానే హ‌త‌మార్చిన‌ట్లు కుమార్ అంగీక‌రించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here