త‌ల మీద ఇంకో త‌ల‌: ఆ వ్య‌క్తిని ఈ స్థితిలో చూసి..డాక్ట‌ర్లు కూడా చ‌లించిపోయారు!

ముంబై: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తి పేరు సంత్‌లాల్ పాల్‌. 31 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న అత‌ను ఓ బ‌ట్ట‌ల వ్యాపారి. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌కు చెందిన సంత్‌లాల్‌కు ఏడేళ్ల కింద‌ట త‌ల‌లో భారంగా అనిపించ‌డంతో ఆసుప‌త్రికెళ్లాడు.

ఎక్స్‌రే తీసి చూసిన డాక్ట‌ర్లు త‌ల‌లో క‌ణితి ఉన్న‌ట్లు చెప్పారు. తాత్కాలికంగా చికిత్స చేయించుకున్నాడు గానీ అది త‌గ్గ‌లేదు. ఇదిగో ఇలా త‌ల మీద ఇంకో త‌ల‌లా మొలిచింది. బుధ‌వారం ముంబైలోని నాయ‌ర్ ఆసుప‌త్రి డాక్ట‌ర్లు.. శ‌స్త్ర చికిత్స చేశారు. క‌ణితిని తొల‌గించారు.

దాని బ‌రువును చూసి డాక్ట‌ర్లు కూడా ఉలిక్కిప‌డ్డారు. ఆ క‌ణితి బ‌రువు 1. 8 కేజీ. త‌ల‌లో ఇంత పెద్ద క‌ణితి ఏర్ప‌డటం ఇదే తొలిసారి అని నాయ‌ర్ ఆసుప‌త్రి డాక్ట‌ర్లు చెబుతున్నారు. దాన్ని తొల‌గించ‌డానికి ఏడు గంట‌ల పాటు ఆప‌రేష‌న్ చేశారు. ఈ నెల 2వ తేదీన సంత్‌లాల్ పాల్ ఆసుప‌త్రిలో చేరాడు.

అప్ప‌టికే ఆ క‌ణితి భారీగా మారిపోయింది. 30 x 30 x 20 సెంటీమీట‌ర్ల సైజులో త‌యారైంది. ఆ త‌రువాత క్ర‌మంగా అది ఇంకా పెద్ద‌గా పెరిగింది. త‌లనొప్పిని భ‌రించాల్సి వ‌చ్చింది. కంటి చూపు కూడా మంద‌గించ‌డం మొద‌లైంది.

సీటీ, ఎంఆర్ స్కానింగ్‌ల‌ను తీశారు డాక్ట‌ర్లు. దీనికోసం ప్ర‌త్యేకంగా సీటీ యాంజియోగ్రాఫీని చేశారు. ఆ క‌ణితికి అందుతోన్న ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను గుర్తించ‌డానికి సీటీ యాంజియోగ్రాఫీని చేయాల్సి వ‌చ్చింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన డాక్ట‌ర్ త్రిమూర్తి నాద‌క‌ర్ణి నేతృత్వంలోని డాక్ట‌ర్ల బృందం సుమారు ఏడు గంట‌ల పాటు ఆప‌రేష‌న్ చేసి, క‌ణితిని తొల‌గించారు.

వైద్య చ‌రిత్ర‌లో ఇదొక అరుదైన ఘ‌ట‌న‌గా డాక్ట‌ర్ ర‌మేష్ భ‌ర్మ‌ల్ చెప్పారు. గ‌తంలో తాము చాలా క‌ణితిల‌ను తొల‌గించిన‌ప్ప‌టికీ.. ఇంత పెద్ద దాన్ని, అందులోనూ త‌ల‌లో మొలిచిన దాన్ని తొల‌గించ‌డం ఇదే తొలిసారి అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here