త‌న చావుకు కార‌ణ‌మేంటో భార్య లిప్‌స్టిక్‌తో డ్రెస్సింగ్ టేబుల్ అద్దంపై రాశాడు..!

క‌ర్నాల్: కొత్త‌గా పెళ్లి చేసుకున్న ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దానికి గ‌ల కార‌ణాలేమిటో వివ‌రించాడు. త‌న భార్య వినియోగించే లిప్‌స్టిక్ తీసుకుని డ్రెస్సింగ్ టేబుల్ అద్దంతో పాటు, త‌న గ‌ది గోడ‌ల నిండా రాశాడు. ఈ రాత‌ల‌నే ఆత్మ‌హ‌త్యా లేఖ‌గా ప‌రిగ‌ణించాల‌ని కూడా కోరాడు.

ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియన్‌..ఎన్‌సీఆర్ ప‌రిధిలోని క‌ర్నాల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని షాహాబాద్ మాజ్రీ మొహ‌ల్లాకు చెందిన ఆ యువ‌కుడి పేరు దీపక్ గోస్వామి.

గ‌త ఏడాది అక్టోబ‌ర్ 31వ తేదీన క‌ర్నాల్‌కు చెందిన ఆంచ‌ల్‌తో పెళ్ల‌యింది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో దీప‌క్ గోస్వామి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.

కుటుంబ క‌ల‌హాల వ‌ల్లే దీప‌క్ ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు. ఈ కార‌ణాల వ‌ల్లే ఆంచ‌ల్ కొద్దిరోజుల కింద‌ట భ‌ర్త‌తో గొడ‌వ ప‌డి పుట్టింటికి వెళ్లింది.

ఇన్నాళ్లూ తాను ఒంట‌రిగా జీవించాన‌ని, పెళ్ల‌యిన త‌రువాత కూడా భార్య త‌న‌ను వ‌దిలి పుట్టింటికి వెళ్ల‌డంతో.. మ‌రోసారి ఒంట‌రివాడిన‌య్యాన‌ని దీప‌క్.. లిప్‌స్టిక్‌తో త‌న గ‌ది గోడ‌ల‌పై రాశాడు. తాను చ‌నిపోవాల‌ని కోరుకోవ‌ట్లేద‌ని, ప‌రిస్థితులే త‌న‌ను దీనికి పురిగొల్పాయ‌ని తన ఆవేద‌న‌ను వెలిబుచ్చాడు.

ఇంటికి లోప‌లి నుంచి గ‌డియ పెట్టి ఉండ‌టంతో దీప‌క్ గోస్వామి త‌ల్లిదండ్రులు, సోద‌రుడు త‌లుపులు ప‌గుల‌గొట్టి ఇంట్లోకి రావాల్సి వ‌చ్చింది. గ‌దిలో దీప‌క్ ఫ్యాన్‌కు నిర్జీవంగా వేలాడుతుండ‌టాన్ని చూసి, నిర్ఘాంతపోయారు.

పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థలానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here