ప్రేమ.. మరో యువకుడిని పొట్టనపెట్టుకుంది..!

ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ‘నిట్’ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. నల్గొండ జిల్లా మల్లేపల్లికి చెందిన రమావత్ అనిల్ (21) తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. నిట్‌లో చదువుతున్న ఓ అమ్మాయితో అనిల్ గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత ఆమె నిట్‌లో చదువు మానేసి నల్గొండ వెళ్లి డిగ్రీలో చేరింది. ఆమె అక్కడికి వెళ్లిపోయిన తర్వాత కూడా ఇద్దరూ తరచుగా మాట్లాడుకునేవారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. మాటలు కాస్తా తగ్గాయి. ఆ అమ్మాయి తనను పట్టించుకోవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్ శనివారం ఉదయం కళాశాల హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి తాడేపల్లిగూడెం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

అనిల్‌ శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో కళాశాల హాస్టల్ నుంచి బయటికి వెళ్ళినట్లు తెలుస్తోంది. తర్వాత తాడేపల్లిగూడెం పట్టణం సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రానికి మృతదేహాన్ని గుర్తించిన రైల్వేపోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆపై అతడి కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో వారు ఆదివారమిక్కడకు చేరుకున్నారు. అనిల్‌ ఆత్మహత్య చేసుకునే ముందు ఇంటికి ఫోన్‌ చేశాడని.. తనను ఓ యువతి మోసం చేసిందని, ఐఏఎస్‌ కావాలనే తన కోరిక ఇక నెరవేరదని, తాను జీవితంలో ఓడిపోయానని చెప్పినట్లు తల్లిదండ్రులు లలిత, లాలూనాయక్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు.. ఇలా ప్రాణాలు తీసుకున్నాడని స్థానికులు కూడా బాధపడుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here