మాన‌వ మృగాల‌కు స‌రైన శిక్ష!

భువ‌నేశ్వ‌ర్‌: మాయలు, మంత్రాలు, చేత‌బ‌డి చేస్తున్నార‌నే కార‌ణంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని దారుణంగా హ‌త్య చేసిన తొమ్మిది మందికి ఉరి శిక్ష ప‌డింది. గుణుపూర్ అద‌న‌పు న్యాయ‌స్థానం శుక్ర‌వారం తీర్పు ఇచ్చింది. ఒడిశాలోని రాయ‌గ‌ఢ జిల్లా కుటింగ అనే మారుమూల కుగ్రామంలో 2016లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లో దోషులుగా గుర్తించిన తొమ్మిది మందికి న్యాయ‌స్థానం మ‌ర‌ణ‌శిక్ష‌ను ఖ‌రారు చేసింది.

ఈ హ‌త్యోదంతంలో మొత్తం 10 మంది దోషులుగా తేలారు. వారిలో ఒక‌డు మైన‌ర్ కావ‌డంతో అత‌ణ్ని జ్యువైన‌ల్ హోమ్‌కు త‌ర‌లించారు. 2016లో రాయ‌గ‌ఢ జిల్లా పుట్ట‌సింగ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని కుటింగ గ్రామంలో ఈ తొమ్మిదిమందీ అమాన‌వీయ ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డారు.

చేతబడి చేస్తున్నార‌నే కార‌ణంతో ఇద్ద‌రు మ‌హిళ‌లు స‌హా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని దారుణంగా హ‌త్య చేశారు. చెట్టుకు క‌ట్టేసి, స‌జీవంగా త‌గులబెట్టారు. అశ్విని స‌బ‌ర్ అనే వ్య‌క్తితో పాటు అత‌ని భార్య అంభేయి, కుమార్తె అస్మానీల‌ను అప‌హ‌రించి, హ‌త్య చేశారు. అశ్విని స‌బ‌ర్ రెండో కుమార్తె మేలాటి దీనికి ప్ర‌త్య‌క్ష‌సాక్షిగా నిలిచారు.

ఈ విష‌యాన్ని బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియజేస్తే.. చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. దీనితో ఆమె కొన్నాళ్ల‌పాటు మౌనంగా ఉన్నారు. అడ‌విలో ఒకేచోట మూడు మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ‌టాన్ని స‌వాలుగా తీసుకున్న పుట్ట‌సింగ పోలీసులు చేప‌ట్టిన ద‌ర్యాప్తులో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ఈ హ‌త్యోదంతంలో ప్ర‌మేయం ఉన్న ప‌దిమందినీ పోలీసులు న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌రిచారు. వారిలో ఒక‌రు మైన‌ర్ కావ‌డంతో జువైన‌ల్ హోమ్‌కు తర‌లించారు. మిగిలిన తొమ్మిది మందికీ ఉరి శిక్ష ఖ‌రారు చేస్తూ గుణుపూర్ అద‌న‌పు జిల్లా న్యాయ‌స్థానం తీర్పు ఇచ్చింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here