వైర‌స్ సోకిన రోగిని ముట్టుకుని న‌ర్స్ కూడా మ‌ర‌ణించిందంటే..దాని తీవ్ర‌త?

కేర‌ళ‌లోని కోజికోడ్ జిల్లా ప‌ర్వ‌త గ్రామాల్లో వెలుగులోకి వ‌చ్చిన ఓ వైర‌స్‌.. ఆ రాష్ట్రాన్ని క‌కావిక‌లం చేస్తోంది. కోజికోడ్, మ‌ళ‌ప్పురం జిల్లాలు ఈ వైర‌స్ బారిన ప‌డి వ‌ణికిపోతున్నాయి. దీని బారిన ప‌డి ఇప్ప‌టికే మూడు రోజుల వ్య‌వధిలో తొమ్మిదిమంది మ‌ర‌ణించారు. ప‌లువురికి ఈ వైర‌స్ సోకిన‌ట్టు అధికారులు నిర్ధారించారు. ఈ వైర‌స్ పేరు `నిఫా`.

 

గ‌బ్బిళాల నుంచి ఈ వైర‌స్ సోకుతున్న‌ట్లు గుర్తించారు. కోజికోడ్ జిల్లాలో ప‌ర్వ‌త గ్రామం సోప్పిక్కాడలో మొద‌టిసారిగా ఈ వైర‌స్ వెలుగులోకి వ‌చ్చింది. పెరంబ్రా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉంటుందీ కుగ్రామం. ఈ నెల 19వ తేదీన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్ర జ్వ‌రం, త‌ల‌నొప్పి ఇత‌ర‌త్రా అనారోగ్యా కార‌ణాల‌తో మ‌ర‌ణించారు.

వారి మ‌ర‌ణానికి నిఫా వైర‌స్ కార‌ణ‌మ‌ని అధికారులు ధృవీక‌రించారు. వారు వినియోగిస్తోన్న బావిలో గ‌బ్బిళం మృత‌దేహాన్ని వారు క‌నుగొన్నారు. గ‌బ్బిళం మృత‌దేహం ప‌డి క‌లుషిత‌మైన నీటిని వినియోగించ‌డం వ‌ల్ల ఈ వైర‌స్ సోకిన‌ట్టు నిర్దారించారు. తీవ్ర జ్వరం బారిన ప‌డిన ఓ కుటుంబానికి వైద్యం చేసిన ఓ న‌ర్సు కూడా వారు మ‌ర‌ణించిన త‌ర‌హాలోనే కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో క‌న్నుమూయ‌డంతో అధికారులు మేల్కొన్నారు.

 

వారిని పొట్ట‌న బెట్టుకున్న‌ది నిఫా వైర‌స్ అని నిర్దారించారు. మొద‌టిసారిగా ఈ వైర‌స్ బారిన ప‌డి మ‌హ‌మ్మ‌ద్ సాదిక్ అనే యువ‌కుడు ఈ నెల 5వ తేదీన మ‌ర‌ణించాడు. మూడురోజుల్లో అత‌ని సోద‌రుడు మ‌హ‌మ్మ‌ద్ స‌లేహ 8న చ‌నిపోయాడు. అదే కుటుంబానికి చెందిన మ‌రియం అనే మ‌హిళ ఈ నెల 19న, ఆమె సోద‌రి అతీఫా 20న చ‌నిపోయారు.

వారికి చికిత్స అందించిన లిని అనే న‌ర్స్ కూడా అదే త‌ర‌హాలో మ‌ర‌ణించ‌డంతో క‌ల‌క‌లం చెల‌రేగింది. అదే కుటుంబానికి చెందిన ఇత‌ర స‌భ్యుల‌కు ర‌క్త ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. నిఫా వైర‌స్ అని తేలింది. ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే కేంద్ర ప్ర‌భుత్వం ఓ ప్ర‌త్యేక వైద్య బృందాన్ని కోజికోడ్‌కు పంపించింది. వైర‌స్ బారిన ప‌డ్డ వారిని కోజికోడ్ జిల్లా ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంద‌ని అంటున్నారు. ఎలాంటి మందుల‌కూ వైర‌స్ లొంగ‌ట్లేద‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here