ప్ర‌భుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా కోసం ఎంత‌కు తెగించాడు!

ఏదైనా ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప్ర‌భుత్వం న‌ష్ట ప‌రిహారాన్ని అంద‌జేస్తుంది. మృతుల కుటుంబీకులు ఆర్థికంగా నిల‌దొక్కుకోవ‌డానికి ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు మాన‌వ‌తా దృక్ప‌థంతో ఎంతో కొంత ఎక్స్‌గ్రేషియా ఇస్తోంది. ఇలా వ‌చ్చే ఎక్స్‌గ్రేషియా కోసం క‌క్కుర్తి ప‌డ్డాడు ఓ తండ్రి. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా న‌లుగురిని పొట్ట‌న‌బెట్టుకున్నాడు.

త‌న కుమార్తెతో పాటు త‌న ఇద్ద‌రు మ‌న‌వరాళ్లు, మ‌న‌వ‌డిని దారుణంగా హ‌త్య చేశాడు. వారి మృత‌దేహాల‌ను మ‌హాన‌దిలో విసిరేశాడు. ఈ కిరాత‌క ఘ‌ట‌న ఒడిశాలోని జ‌గత్‌సింగ్‌పూర్ జిల్లా పారాదీప్ స‌మీపంలో చోటు చేసుకుంది. మ‌హాన‌ది ఈ జిల్లా గుండా ప్ర‌వ‌హిస్తోంది. కుజంగ్ గ్రామ స‌మీపంలో మ‌హాన‌దిలో ఈ నెల 10వ తేదీన నాలుగు మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

దీనిపై పోలీసుల ద‌ర్యాప్తులో ఈ షాకింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌లో మృతురాలి తండ్రి అక్ష‌య్‌సేథీని విచారించారు పోలీసులు. ఎక్స్‌గ్రేషియా కోసం తానే వారిని హ‌త్య చేసిన‌ట్లు అంగీక‌రించాడు. అక్ష‌య్ సేథీ పెద్ద కుమార్తె మ‌మీనా సేథికి ఇద్ద‌రు కుమార్తెలు, ఓ కుమారుడు. మమీనా సేథీ భ‌ర్త అనంత్ ఓ రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌రణం పాల‌య్యాడు.

దీనితో మాన‌వ‌తాదృక్ప‌థం కింద ఒడిశా రాష్ట్రప్ర‌భుత్వం మ‌మీనా సేథీకి కొంత న‌ష్ట ప‌రిహారాన్ని, అనంత్ ప‌నిచేసే సంస్థ యాజ‌మాన్యం రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్‌గ్రేషియా ఇచ్చింది. భ‌ర్త చ‌నిపోవ‌డంతో త‌న పిల్ల‌ల‌తో క‌లిసి మ‌మీనా సేథీ తండ్రి వ‌ద్దే నివ‌సిస్తోంది.

దీనిపై క‌న్నేసిన అక్ష‌య్ సేథీ ఆమె కుటుంబాన్ని మ‌ట్టుబెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ నెల 9వ తేదీన త‌న కుమార్తె మ‌మీనా, మ‌న‌వ‌రాళ్లు బ‌ర్ష, దిశ‌, మ‌న‌వ‌డు మున్నా గొంతునులిమి హ‌త్య చేశాడు. మృత‌దేహాల‌ను మ‌హాన‌దిలో పారేశాడు.

మ‌రుస‌టి రోజు అవి నీటిపైకి తేలాయి. మొద‌ట గుర్తు తెలియ‌ని మృత‌దేహాలుగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. అనంత‌రం చేప‌ట్టిన ద‌ర్యాప్తులో ఈ షాకింగ్ ట్విస్టులు వెలుగు చూశాయి. దీనితో అక్ష‌య్ సేథీని పోలీసులు అరెస్టు చేశారు. కేసు న‌మోదు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here