16 రోజుల ప‌సిగుడ్డును కోతి ఎత్తుకెళ్లి..బావిలో ప‌డేసింది!

భువ‌నేశ్వ‌ర్‌: అత్యంత విషాద‌క‌ర ఘ‌ట‌న ఇది. త‌ల్లి ఒడిలో నిద్ర‌పోతున్న 16 రోజుల ప‌సికందును కోతి ఎత్తుకెళ్లింది. చూస్తుండగానే క‌నుమ‌రుగైంది. ఆ కోతి కోసం వెదికే ప్ర‌య‌త్నంలో ఉన్న త‌ల్లిదండ్రులకు ఆ మ‌గ‌బిడ్డ‌ ఓ వ్య‌వ‌సాయ బావిలో నిర్జీవంగా క‌నిపించాడు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని క‌ట‌క్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ బాబు ఆ త‌ల్లిదండ్రుల‌కు తొలి సంతానం.

జిల్లాలోని బాంకీ బ్లాక్ ప‌రిధిలోని త‌ల‌బ‌స్తా గ్రామానికి చెందిన రామకృష్ణ నాయక్‌ దంపతులకు 16 రోజుల కిందట కుమారుడు పుట్టాడు. శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఇంట్లో దోమతెర మధ్యలో ఆయన కుమారుడితో కలిసి పడుకుని ఉండగా వారి ఇంట్లోకి జొర‌బ‌డ్డ ఓ కోతి దోమతెరను చింపి పసికందును ఎత్తుకెళ్లింది.

అదే సమయంలో లోపలికి వచ్చిన తల్లి గట్టిగా కేకలు వేస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. రామ‌కృష్ణ నాయ‌క్ ఆ కోతిని ప‌ట్టుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. గ్రామ‌స్తుల‌ను కూడా ఆయ‌న అప్ర‌మ‌త్తం చేశారు. అంద‌రూ క‌లిసి ఆ కోతిని వెంబడించినా అది దొర‌క‌లేదు. వెంట‌నే వారు అటవీశాఖ అధికారులు, పోలీసులకు స‌మాచారం ఇచ్చారు.

 

సాయంత్రం వరకూ గాలించినప్ప‌టికీ పసికందు ఆచూకీ కనిపించలేదు. దీనితో రామ‌కృష్ణ నాయ‌క్ గ్రామంలో ఉన్న ఆంజ‌నేయ స్వామి ఆల‌యానికి వెళ్లి పూజ‌లు చేశారు. సాష్టాంగ ప్ర‌ణామాలు చేశారు.

రాత్రంతా కోతి కోసం అన్వేషించిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం లేకుండా పోయింది. ఆదివారం తెల్ల‌వారు జామున ఓ వ్య‌వ‌సాయ బావిలో ఆ బాబు మృత‌దేహం క‌నిపించింది. పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని.. బాంకీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న కేసు న‌మోదు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here