అర్ధ‌రాత్రి మ‌ర్రిచెట్టు కింద ఏడాది ప‌సిపాప ఏడుపు..!

ఆసుప‌త్రికి తీసుకెళ్తానంటూ ఏడాది వ‌య‌స్సున్న త‌న కుమార్తెను ఊర‌వ‌త‌ల మ‌ర్రిచెట్టు కింద ప‌డేసి వ‌చ్చాడో కిరాత‌క తండ్రి. అర్ధ‌రాత్రి పూట మ‌ర్రిచెట్టు వ‌ద్ద నుంచి ఏడుపు విన‌పిస్తుండ‌ట‌తో మొద‌ట భ‌య‌ప‌డ్డ గ్రామ‌స్తులు.. ఆ త‌రువాత ధైర్యం చేసుకుని వెళ్లి చూడ‌గా ప‌సిపాప క‌నిపించింది. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని సోరో బ్లాక్ ప‌రిధిలో ఉన్న మేడ‌గ‌డియా గ్రామానికి చెందిన కైలాష్ చంద్ర సాహుకు రెండున్న‌రేళ్ల కింద‌ట అదే గ్రామానికి చెందిన యువ‌తితో వివాహ‌మైంది. పెళ్లయిన‌ప్ప‌టి నుంచీ అత‌ను అత్త‌వారింట్లోనే నివ‌సిస్తున్నాడు. చిన్నా, చిత‌క ప‌నులు చేసుకుంటూ జీవించేవాడు. ఏడాది కింద‌ట కైలాష్‌కు తొలిచూలు సంతానంగా ఆడ‌పిల్ల జ‌న్మించింది.

తొలి కాన్పులో ఆడ‌పిల్ల పుట్ట‌డం అత‌నికి సుతారామూ న‌చ్చ‌లేదు. శ‌నివారం రాత్రి పాప‌కు ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోవ‌డంతో.. ఆసుప‌త్రికి తీసుకెళ్తాన‌ని బ‌య‌లుదేరాడు. అత‌ను ఆసుప‌త్రికి వెళ్ల‌లేదు. గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాలయ ఆవ‌ర‌ణ‌లో ఓ మ‌ర్రిచెట్టు కింద ఆ చిన్నారిని వ‌దిలేశాడు. ఇంటికి కూడా వెళ్ల‌లేదు.

 

అర్ధ‌రాత్రిపూట మ‌ర్రిచెట్టు వ‌ద్ద నుంచి ఏడుపు వినిపిస్తుండ‌టంతో గ్రామ‌స్తులు అక్క‌డికి వెళ్లి చూడ‌గా.. పాప క‌నిపించింది. అప్ప‌టికే గ్రామ‌స్తులు బిడ్డ‌, భ‌ర్త కోసం వారు అన్వేషిస్తున్నారు. పాప‌ను వ‌దిలేసిన విష‌యం తెలిసిన వెంట‌నే గ్రామ‌స్తులు కైలాష్ చంద్ర సాహును ప‌ట్టుకుని ఒళ్లు హూనం చేశారు. సోరో బ్లాక్‌ పోలీసుల‌కు అప్ప‌గించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here