మృత‌దేహాన్ని పూడ్చిపెడుతుండ‌గా హ‌త్య‌గా అనుమానం! శ్మ‌శానంలో పోలీసులు

త‌మ కుమారుడి మృత‌దేహానికి అంతిమ యాత్ర నిర్వ‌హించారు త‌ల్లిదండ్రులు. మృతుడి కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితులంద‌రూ శ్మశాన వాటిక‌కు చేరుకున్నారు.

శ్మశానంలో ఆర‌డుగుల గుంత‌ను కూడా తీసి సిద్ధంగా ఉంచారు. మృత‌దేహాన్ని పాడె మీది నుంచి కిందికి దించారు. అంతిమ సంస్కారాన్ని నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో.. హ‌ఠాత్తుగా పోలీసులు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

డాక్ట‌ర్‌ కూడా రెడీ అయ్యారు. కార‌ణం.. త‌మ కుమారుడిది స‌హ‌జ‌మ‌ర‌ణం కాద‌ని, హ‌త్య‌గా అనుమానించిన త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డ‌మే.

మృత‌దేహాన్ని పోస్ట్‌మార్ట‌మ్ కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని యాద్గిర్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి పేరు దేవ‌ప్ప‌. బ‌స‌మ్మ అనే యువ‌తిని అత‌ను ప్రేమించాడు.

అత‌నిది వ‌న్‌సైడ్ ల‌వ్‌. ఆ యువతి త‌న ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌నే బాధ‌తో జిల్లాలోని వ‌డ‌గెరా గ్రామానికి చెందిన దేవ‌ప్ప విషం సేవించి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు.

కింద‌టి నెల 10వ తేదీన వ‌డ‌గెరా గ్రామ శివార్ల‌లో దేవ‌ప్ప స్పృహ త‌ప్పిన స్థితిలో క‌నిపించాడు. వెంట‌నే అత‌ణ్ణి ఆసుప‌త్రికి త‌ర‌లించగా.. చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం మ‌ర‌ణించాడు.

ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఉద్దేశంతో విషం సేవించ‌డం వ‌ల్ల అనారోగ్యానికి గురై మ‌ర‌ణించాడ‌ని అంద‌రూ భావించారు. అత‌ని సెల్‌ఫోన్‌లో ఉన్న బెదిరింపు ఎస్ఎంఎస్‌లు, ఫొటోలు చూసిన త‌రువాత త‌ల్లిదండ్రుల‌కు అనుమానం వ‌చ్చింది.

అప్ప‌టికే అంతిమ సంస్కారాల‌కు ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. అంతిమ‌యాత్ర కూడా మొద‌లైంది. త‌మ కుమారుడి మృత‌దేహాన్ని పూడ్చిపెడితే.. వెలికి తీయాల్సి వ‌స్తుంద‌నే ఉద్దేశంతో చివ‌రిక్ష‌ణంలో పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు డాక్ట‌ర్‌తో స‌హా శ్మ‌శాన వాటిక‌కు చేరుకున్నారు. మృత‌దేహాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ద‌ర్యాప్తు ఆరంభించారు. దేవ‌ప్ప ప్రేమించిన యువ‌తి త‌ర‌ఫు నుంచి ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here