ఆడ‌శిశువును అమ్మ‌బోతున్నార‌నే విష‌యం టీ షాపు వాడు చెప్ప‌డంతో..చిటికెలో అడ్డుకున్నారు!

క‌ల‌బుర‌గి: రెండు వారాల వ‌య‌స్సున్న ఓ ప‌సిపాప‌ను విక్ర‌యించ‌డానికి సిద్ధ‌ప‌డిన త‌ల్లిదండ్రుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. 15 వేల రూపాయ‌ల‌కు హైద‌రాబాద్‌కు చెందిన దంప‌తుల‌కు ఆ ఆడ‌శిశువును విక్ర‌యించ‌బోతుండ‌గా..పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. వారిని అరెస్టు చేశారు.

కొన‌డానికి ప్ర‌య‌త్నించిన దంప‌తుల‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బుర‌గి జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని చింఛోళి తాలూకా ప‌రిధిలోని చందునాయ‌క్ తండాకు చెందిన రామ‌చంద్ర‌, అన‌సూయ దంప‌తుల‌కు నాలుగో కాన్పులో ఆడ‌శిశువు జ‌న్మించింది.

తెలంగాణ స‌రిహ‌ద్దుల‌కు ఆనుకుని ఉంటుందీ గ్రామం. క‌ర్ణాటక‌-తెలంగాణ స‌రిహ‌ద్దు ప‌ట్ట‌ణం తాండూరు నుంచి 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఆ పాప‌ను పెంచ‌లేమ‌ని భావించిన త‌ల్లిదండ్రులు విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

షాదిపుర గ్రామానికి చెందిన ఆశా కార్య‌క‌ర్త సువ‌ర్ణ జ‌మేదార్ వారికి స‌హ‌క‌రించ‌డానికి ముందుకొచ్చింది. ఆమే ద‌గ్గ‌రుండి హైద‌రాబాద్‌లో త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న పాల్ అనే దంప‌తుల‌కు పాప‌ను 15 వేల రూపాయ‌ల‌కు అమ్మేలా బేరం మాట్లాడింది.

హైద‌రాబాద్ నుంచి పాల్ దంప‌తులు కారులో చందునాయ‌క్ తండాకు చేరుకున్నారు కూడా. ఆడ‌శిశువును విక్ర‌యిస్తున్నార‌నే విష‌యం పోలీసుల‌కు నాట‌కీయంగా తెలిసింది.

చందునాయ‌క్ తండా వ‌ద్ద ఓ టీ అంగ‌ట్లో దీనికి సంబంధించి, చ‌ర్చ జ‌రుగుతుండ‌టం పోలీసుల‌కు తెలిసింది. దీనిపై వారు మ‌రింత కూపీ లాగ‌గా.. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అప్ప‌టిక‌ప్పుడు వారు రెడ్‌హ్యాండెడ్‌గా అన‌సూయ‌, రామ‌చంద్ర, పాల్ దంప‌తుల‌తో పాటు ఆశా కార్య‌క‌ర్త‌ సువ‌ర్ణను అరెస్టు చేశారు. వారిపై కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here