లోక్ సభలో అవిశ్వాస తీర్మానాలు అందాయన్నారు.. కానీ..!

వైసీపీ, తెలుగుదేశం పార్టీలు నేడు భారతీయ జనతాపార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఇరు పార్టీల అవిశ్వాస తీర్మానాలూ అందాయని సభలో ప్రకటించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ అవిశ్వాస తీర్మానాలను వేర్వేరుగా చదివి వినిపించారు. సభ ఆర్డర్ లో లేనందున అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టలేకపోతున్నట్లు ప్రకటించిన ఆమె సభను సోమవారానికి వాయిదా వేశారు. లోక్ సభ వాయిదా పడటంతో సోమవారం మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసులు లోక్ సభ సెక్రటరీ జనరల్ కు ఇవ్వాలని నిర్ణయించారు.

అవిశ్వాస తీర్మానాలు తనకు అందాయని, వాటిపై చర్చించాలని తనకు ఉన్నప్పటికీ, సభ ఆర్డర్ లో లేదని సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. సభలో చర్చకు సానుకూల పరిస్థితి ఉన్నట్టు తనకు కనిపించడం లేదని, అందువల్లే అవిశ్వాసంపై చర్చ చేపట్టలేకపోతున్నానని అన్నారు. అన్ని పార్టీల సభ్యులూ ఇలా పోడియంలో నిరసనలు తెలుపుతూ నినాదాలు చేస్తున్న పరిస్థితుల్లో తాను మాత్రం ఏం చేయగలనని ప్రశ్నించారు.

లోక్ సభలో ప్రస్తుత బలాబలాలను ఒక్కసారి పరిశీలిస్తే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 331 మంది సభ్యుల బలముంది. బీజేపీ 273, శివసేన 18, టీడీపీ 16, ఎల్జేపీ 6, ఎస్ఏడీ 4, ఆర్ఎల్ఎస్పీ 3, ఏడీ 2, జేడీ (యూ) 2, నామినేటెడ్ సభ్యులు ఇద్దరితో పాటు, జేకే పీడీపీ, ఏఐఎన్ఆర్సీ, ఎన్పీపీ, పీఎంకే, ఎస్డీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరితో పాటు అవసరమైతే స్పీకర్ మద్దతు ఆ పార్టీకుంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లినా ఎన్డీయేకు 315 మంది సభ్యుల బలముంటుంది.

 

ఇక విపక్ష యూపీఏ కు 52 మంది సభ్యుల బలముండగా, అందులో కాంగ్రెస్ 48, ఐయూఎంఎల్ 2, కేసీ (ఎం) 1, ఆర్ఎస్పీ 1 ఉన్నారు. జనతా పరివార్ కూటమికి ఏడుగురు సభ్యుల బలముండగా, ఆర్జేడీ 3, ఐఎన్ఎల్డీ 2, జేడీ (ఎస్) 2 ఉన్నారు. అన్నాడీఎంకే 37, తృణమూల్ 34, బీజేడీ 20, టీఆర్ఎస్ 11, సీపీఐ (ఎం) 9, వైఎస్ఆర్ సీపీ 9 (నలుగురు టీడీపీలో చేరినా వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు కాబట్టి సాంకేతికంగా వైసీపీ సభ్యుల కిందే లెక్క), ఎస్పీ 7, ఎన్సీపీ 6, ఆప్ 4, ఏఐయూడీఎఫ్ 3, జేఎంఎం 2తో పాటు ఏఐఎంఐఎం, సీపీఐ, జేకేఎస్సీ, ఎస్ డబ్ల్యూపీ, జేఏపీ (ఎల్)లకు తలో సభ్యుడు ఉన్నారు. వీరంతా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోని మొత్తం 147 మంది ఎంపీలు లోక్ సభలో సభ్యులుగా ఉన్నారు. ఇతరులు ముగ్గురుండగా, ఐదు ఖాళీలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here