కరుడుగట్టిన పార్థీ గ్యాంగ్ రాయలసీమలో అడుగు పెట్టిందంటూ మెసేజ్.. ఇంతకూ నిజమెంత..!

కొన్ని కొన్ని సార్లు ప్రజలకు వచ్చే ఫార్వర్డ్ మెసేజీలు ఎంతో ఇబ్బందులకు గురిచేస్తాయి. వాళ్లకు వచ్చిన మెసేజీలతో భయపడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అంతేకాకుండా కొన్ని సార్లు ఈ మెసేజీల వలన ఎన్నో నష్టాలు కూడా జరుగుతాయి. కొద్ది రోజుల క్రితం తమిళనాడులో పిల్లలను తీసుకొని వెళ్ళడానికి కొన్ని గ్యాంగులు వచ్చాయని ఓ మెసేజీ వచ్చింది.. అయితే ఈ మెసేజీని నమ్మి ఇద్దరిని అన్యాయంగా చంపేశారు. తాజాగా రాయలసీమ జిల్లాల్లో ఇలాంటిదే ఓ మెసేజీ ప్రజలను కలవరపెడుతోంది. అదేమిటంటే ‘జిల్లాలోకి పార్థీ గ్యాంగ్ వచ్చింది. ఎప్పుడు ఏ ఇంట్లో చొరబడతారో తెలియదు. అడ్డొస్తే నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడతారు. జాగ్రత్తగా ఉండండి. అందరికీ ఈ మెసేజ్‌ను పంపండి’ అని..! దీన్ని చూసిన వాళ్ళకు భయం మొదలవడం చాలా కామన్.. దీంతో ఎవరైనా అనుమానితులు గ్రామాల్లో కనిపిస్తే చితక్కొడుతున్నారు.

రాయదుర్గం, హిందూపురం ప్రాంతాల్లో తొలుత ఈ మెసేజ్‌లు హోరెత్తాయి. ఎందుకంటే ఇవి కర్ణాటకకు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి..! ఈ మెసేజ్‌‌తో హడలిపోతున్న ప్రజలు అపరిచితులు కనిపించిన వెంటనే అప్రమత్తమవుతున్నారు. కర్ణాటకలో ఎన్నికలు జరగనుండడంతో పోలీసుల పహారా పెరిగిందని, దీంతో బెంగళూరు, బళ్లారి నుంచి పార్థీ గ్యాంగ్ రాయలసీమలో అడుగుపెట్టిందని పుకార్లు జోరందుకున్నాయి. తర్వాత కర్నూలు జిల్లాలోని ఆదోని, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, కడప జిల్లాలోని ప్రొద్దుటూరులకు పాకాయి.


ఈ మెసేజీలను పోలీసులు కూడా సీరియస్ గానే తీసుకున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి రాయదుర్గం, హిందూపురం ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.. కానీ ఎక్కడా కనిపించలేదు. చిత్తూరు ఎస్పీ రాజశేఖరబాబు కూడా పార్థీ గ్యాంగ్‌కు సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించలేదని చెప్పారు. అయితే పార్థీ గ్యాంగ్‌ వచ్చిందంటూ పుకార్లకు తెరలేపిన వ్యక్తిని కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఒక ఫార్వర్డ్ మెసేజీ పంపేముందు ముందూ వెనుకా ఆలోచించాలి. ఏది పడితే అది పంపేద్దాం అని అనుకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here