బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య చిన్న గొడవ కాస్తా.. రక్తం కళ్ళజూసింది..!

అభిమానానికి.. ఉన్మాదానికి మధ్య ఓ చిన్నపాటి గీత అనేది ఉంటుంది. ఆ గీత ఎవరు దాటినా సరే ఫలితాలు వేరేలా ఉంటాయి. అభిమానుల పేరుతో కొట్టుకోడాలు.. తిట్టుకోడాలు మనకేమీ కొత్త కాదు..! కాలం మారుతున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా అలాంటి ఉదంతమే పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య చోటుచేసుకుంది.

బాలయ్య, పవన్ అభిమానుల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణ చివరికి ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వెళ్లింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లాలోని పురుషోత్తపురంలో అజ్ఞాతవాసి, జై సింహా సినిమాల విషయంలో బాలయ్య, పవన్ అభిమానుల మధ్య మాటామాటా పెరిగింది. మాటలు కాస్తా చేష్టలకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాకా వెళ్లింది.

గొడవ పెద్దదై బాలయ్య అభిమాని పవన్ అభిమానిపై బ్లేడుతో దాడిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పవన్ అభిమానిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అజ్ఞాతవాసి సినిమా రెండు రోజుల క్రితం విడుదలైంది. బాలయ్య నటించిన జయ సింహ నేడు విడుదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here