పవన్ కళ్యాణ్‌కి హెరిటేజ్‌ మాదిరిగా ఒక సంస్థ లేదు.. భయపడి టీడీపీకి సపోర్ట్ ఇవ్వలేదు..!

2019లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని, సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇచ్ఛాపురం బహిరంగం సభలో పవన్ మాట్లాడుతూ, ఎవరో ఆడిస్తే ఆట బొమ్మను తాను కాదని, భయపడే వ్యక్తిని కాదని అన్నారు. బీజేపీకి భయపడుతోంది తాను కాదని, సీఎం చంద్రబాబేనని అన్నారు. అసలు, ఆయన ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ‘చంద్రబాబు భయపడటానికి కారణం..ఓటుకు నోటు..లోగుట్టు పెరుమాళ్ల కెరుక’ అని అన్నారు. ఏపీని మోసం చేసిన బీజేపీని టీడీపీ నిలదీయలేకపోయిందని, టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.

గతంలో తెలుగుదేశం పార్టీని ఎందుకు సపోర్ట్ చేశానో కూడా పవన్ కళ్యాణ్ స్పందించాడు.‘నేను వారి నుంచి ఒక పదవి కోరుకోలేదు. ఒక కాంట్రాక్ట్ అవసరంలేదు. మా వాళ్లకు గుర్తింపు ఇవ్వండి, పదవి ఇవ్వండి అని అడగలేదు. కనీసం మా జనసేన సైనికుల మీద దాడి చేయకండి అని అడిగాను. అంటే మీకు మద్దతు తెలుపుతున్నందుకు జీవితకాలం బానిసలుగా ఉండిపోవాలా? ఇది ప్రజాస్వామ్యం. మేం ఇష్టపడి మీకు సపోర్ట్ చేశాం. భయపడి చేయలేదు. ప్రజలకు అండగా ఉంటారని, వెనకబడిన శ్రీకాకుళానికి అండగా ఉంటారని, వెనకబడిన ఉత్తరాంధ్రకు అండగా ఉంటారని మద్దతిచ్చాను. అంతమాత్రన మీకు అండగా ఉంటూ, వత్తాసు పలికిన మా జనసైనికుల మీద మీ ఎమ్మెల్యేల చేత, మీ వాళ్ల చేత దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం’ అంటూ చంద్రబాబును హెచ్చరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తమలా ఒక పార్టీని స్థాపించలేదని, ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని ఆయన పెంచి పోషించారని చెప్పారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తరవాత, ఆయన స్థాపించిన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా చేరిన చంద్రబాబు అంచెలంచెలుగా ఎదిగారు. పవన్ కళ్యాణ్‌కు ఆ సుఖమెక్కడుంది. పవన్ కళ్యాణ్‌కి హెరిటేజ్‌ మాదిరిగా ఒక సంస్థ లేదు. కానీ జనబలం ఉంది. సామాజిక స్పృహ ఉండి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ముఖ్యమంత్రి అయిపోవాలని నేను కోరుకోను. నేర్చుకుంటాను, శ్రమిస్తాను, సాటి మనిషి కష్టాలను అర్థం చేసుకుంటాను.. అంతేకానీ నన్ను ముఖ్యమంత్రిని చేసేయండి, మీ కష్టాలు తీరుస్తానే అనే వ్యక్తత్వం నా దగ్గరలేదు అని జనసేనాని చెప్పుకొచ్చారు. తాను గెలుస్తానో లేదు తెలియదు కానీ, ప్రజలను మాత్రం మోసం చేయనని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here