మృత‌దేహాన్ని స్మ‌శానానికి తీసుకెళ్లారు..ఖ‌న‌నం చేయ‌కుండా వెన‌క్కి పారిపోయి వ‌చ్చారు!

చిక్క‌బ‌ళ్లాపుర‌: త‌మ కుటుంబ పెద్ద చ‌నిపోతే.. బాధాత‌ప్త హృద‌యాల‌తో అత‌ని మృత‌దేహాన్ని స్మ‌శానానికి తీసుకెళ్లారు. మృతుడి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్య‌లో అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్నారు.

మృత‌దేహాన్ని ఖ‌న‌నం చేయ‌డానికి ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. ఆర‌డ‌గుల గొయ్యిని సిద్ధం చేసి ఉంచారు. గొయ్యి వ‌ద్ద పాడెను దింపారు. సంప్ర‌దాయం ప్ర‌కారం.. మృత‌దేహాన్ని గొయ్యిలోకి దింపారు.

ఆ త‌రువాత ప‌ది నిమిషాల పాటు కూడా ఉండ‌లేక‌పోయారు. మృత‌దేహాన్ని దింపిన గొయ్యిని పూడ్చ‌ను కూడా లేదు. వెన‌క్కి తిరిగి చూడ‌కుండా పారిపోయి వెన‌క్కి వ‌చ్చేశారు. కార‌ణం..తేనెటీగ‌లు.

 

అంతిమ సంస్కారాల‌ను నిర్వ‌హించే స‌మ‌యంలో ఒక్క‌సారిగా తేనెటీగ‌లు వారిపై దాడి చేశాయి. దీనితో చెట్టుకొక‌రు, పుట్ట‌కొక‌రుగా పారిపోయారు. సుమారు గంట‌పాటు వారు స్మ‌శానంలో అడుగు పెట్ట‌డానికి భ‌య‌ప‌డ్డారు.

ఆ త‌రువాత తేనెటీగల రొద స‌ద్దుమ‌ణ‌గ‌గానే గొయ్యి వ‌ద్ద‌కు వెళ్లి, అంతిమ సంస్కారాల‌ను నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్క‌బ‌ళ్లాపుర జిల్లా దేవ‌న‌హ‌ళ్లి తాలూకాలోని విజ‌య‌పుర గ్రామంలో చోటు చేసుకుంది. తేనెటీగ‌ల దాడిలో సుమారు 15 మంది గాయప‌డ్డారు. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here