ఇళ్ల మ‌ధ్య బోల్తా కొట్టి పేలిపోయిన పెట్రోల్ ట్యాంక‌ర్‌..దీని ఎఫెక్ట్‌?

సుమారు 15 వేల లీట‌ర్ల పెట్రోలును తీసుకెళ్తున్న ఓ ట్యాంక‌ర్ ఇంకెక్క‌డా స్థ‌లం లేద‌న్న‌ట్టు ఇళ్ల మ‌ధ్య ప‌ల్టీ కొట్టింది. బోల్తా ప‌డ‌టంతోనే నిప్పుర‌వ్వ‌లు రాజుకున్నాయి. మంట‌లు చెల‌రేగాయి. ఒక్క‌సారిగా భ‌గ్గుమంటూ మండిందా ట్యాంక‌ర్‌. పెద్ద శ‌బ్దం చేస్తూ పేలిపోయింది. ఏ మాత్రం ఊహించ‌ని ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు బిత్త‌ర‌పోయారు.

అటు ఇళ్ల‌లో ఉండ‌లేక‌, ఇటు బ‌య‌టికి ప‌రుగులు తీయ‌లేక స‌త‌మ‌త‌మ‌య్యారు. ట్యాంక‌ర్ నుంచి వెలువ‌డిన మంట‌లకు ఆరు నివాసాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. అదృష్ట‌వ‌శావ‌త్తూ ప్రాణాపాయం త‌ప్పింది. కర్ణాటకలోని చిక్కమంగళూరులో జిల్లా కడూర్‌లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

ఓ పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి ఇళ్లలోకి దూసుకొచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే ట్యాంకర్ పేలిపోయింది. వేగంగా వచ్చిన ట్యాంకర్ అదుపుతప్పి పల్టీలు కొట్టుకుంటూ రావటం వల్లే మంటలు అంటుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.

డ్రైవర్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకర్ నుంచి ఎగసిపడిన మంటలు చుట్టు పక్కల ఉన్న ఇళ్లను కాలి బూడిద చేశాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు నాలుగు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. మంటల ధాటికి ఆయిల్ ట్యాంకర్ పూర్తిగా కాలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here