త‌ప్పుడు వార్త‌ల‌పై అంత ప్రేమెందుకో? చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న మంత్రి..వ‌ద్ద‌న్న ప్ర‌ధాని

న్యూఢిల్లీ: త‌ప్పుడు వార్త‌లు, ప్ర‌జ‌ల‌ను మోసగించే క‌థ‌నాలు, పాఠ‌కులకు ప‌క్క‌దారి ప‌ట్టించే వార్తా క‌థ‌నాల‌పై కేంద్రం క‌న్నెర్ర చేసింది. అలాంటి వార్త‌ల‌ను రాసే విలేక‌రుల గుర్తింపును ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

జ‌ర్న‌లిస్టుల ప్రాణంతో స‌మాన‌మైన `అక్రిడిటేష‌న్‌` కార్డును ర‌ద్దు చేయ‌డంతో పాటు, నిర్దుష్ట కాల ప‌రిమితి వ‌ర‌కూ ఎక్క‌డా, ఏ మీడియా హౌస్‌లోనూ ఉద్యోగం దొర‌క‌ని విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

దీనికోసం స‌రికొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే- ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఇందులో జోక్యం చేసుకున్నారు. ఈ ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని స‌మాచార మంత్రిత్వ‌శాఖ‌ను సూచించారు. త‌ప్పుడు వార్త‌ల వ్య‌వ‌హారాన్ని ప్రెస్ కౌన్సిలే చూసుకుంటుంద‌ని చెప్పారు.

త‌ప్పుడు వార్త‌ల‌ను రాయ‌డం ఇప్ప‌టిదా? జ‌ర్న‌లిజం అనేది మీడియా సంస్థ‌ల యాజ‌మాన్య చేతుల్లోకి వెళ్లిన‌ప్పుడే త‌ప్పుడు వార్త‌లు వెల్లువ మొద‌లైంది. ఏది తప్పో, ఏది ఒప్పో ఆలోచించుకోలేని దుస్థితిలో ప‌డ్డారు పాఠ‌కులు. ఒక వార్తను నాలుగైదు దిన‌ప‌త్రిక‌ల్లో చ‌దివిన త‌రువాత గానీ.. దాని అస‌లు సారాంశం బోధ‌ప‌డని హీన‌స్థితి జ‌ర్న‌లిజంలో నెల‌కొంది.

ఎవ‌రి అజెండా వారిది. జ‌నం పేరు చెప్పుకొని తాము భుజాన మోసే నాయ‌కుల‌ను ఆకాశానికెత్తేస్తున్నాయి మీడియా సంస్థ‌లు. ఉన్న‌వి లేన‌ట్టుగా, లేనివి ఉన్న‌ట్టుగా పాఠ‌కుల క‌ళ్ల‌కు గంత‌లు క‌డుతున్నాయి. ఇలాంటి వాటిని అరిక‌ట్ట‌డానికి స‌మాచార మంత్రిత్వ‌శాఖ తాజాగా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించ‌గా.. సాక్షాత్తూ ప్ర‌ధానే వ‌ద్ద‌ని ఆదేశించారు.

దిన‌ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మైనవి, ఛాన‌ళ్ల‌ల్లో ప్ర‌సారం చేసిన క‌థ‌నాలు గానీ త‌ప్పుడు వార్త‌ల‌ని తేలితే, ద‌శ‌ల‌వారీగా చ‌ర్య‌లు ఉంటాయ‌ని కేంద్ర స‌మాచార మంత్రిత్వ‌శాఖ పేర్కొంది. మొద‌టిసారి త‌ప్పుడు క‌థ‌నాలు రాస్తే ఆరు నెల‌లు, మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తే ఏడాదిపాటు అక్రిడిటేష‌న్ కార్డును ర‌ద్దు చేసేలా నిబంధ‌న‌ల‌ను రూపొందిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఈ మేర‌కు స‌మాచార మంత్రిత్వ‌శాఖ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న విడుద‌లై 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే- ఏకంగా ప్ర‌ధాన‌మంత్రే ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకున్నారు. ఆ ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here