ఒంటరి మహిళలే అతని టార్గెట్. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రసాదిస్తానని నమ్మిస్తూ, నయవంచన చేయడం అతని అలవాటు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న అతగాడి బండారాన్ని మూడో భార్య బట్టబయలు చేసింది. కటకటాల వెనక్కి తోసింది. ఈ ఘటన కర్ణాటనలోని తుమకూరు జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని శిరా పట్టణం జ్యోతినగర ప్రాంతానికి చెందిన రాఘవేంద్ర ఇటుక బట్టీ యజమాని. ఒంటరిగా నివసించే యువతులు, మహిళలను టార్గెట్గా చేసుకోవడం అతని హాబీ. వారికి ఆర్థిక సహాయం చేస్తున్నట్టు, కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నట్టు నటిస్తూ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 2010లో కడూరు తాలూకాకు చెందిన జ్యోతిని పెళ్లాడాడు.
2013లో శిర పట్టణానికి చెందిన పంకజ కుటుంబాన్ని ఆదుకుంటున్నట్టు నటిస్తూ, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే పట్టణానికి చెందిన లతను కూడా ఆర్థిక సహాయం చేస్తున్నట్టు నటించి, పెళ్లి చేసుకున్నాడు. అతని ఆగడాలను గుర్తించిన జ్యోతి భర్తకు దూరం అయ్యారు.
ఆ తరువాత అతను సురేఖ అనే వితంతువును పెళ్లాడాడు. ఒకే పట్టణంలో నివసిస్తున్నప్పటికీ.. అతనికి రెండు పెళ్లిళ్లయ్యాయనే విషయం వారికి తెలియదు. భర్త నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్టు తెలియడంతో రెండో భార్య పంకజ అతనిపై శిరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.