భార్య‌కు సీమంతం చేసిన తెల్లారే..బైక్‌పై తీసుకెళ్లి గొంతుకోశాడు!

బ‌ళ్లారి: మ‌రో రెండునెల‌ల్లో ఆమె బిడ్డ‌కు జ‌న్మనివ్వాల్సి ఉంది. ఈ ప్ర‌పంచానికి ఓ కొత్త అతిథిని ప‌రిచ‌యం చెయ్యాల్సి ఉంది. త‌న పుట్ట‌బోయే బిడ్డ గురించి క‌ల‌లు కంటోన్న ఆ త‌ల్లిని నిర్దాక్షిణ్యంగా హ‌త‌మార్చాడు ఆమె భ‌ర్త‌. సీమంతం చేసిన మ‌రుస‌టి రోజే ఆమెను బైక్‌పై తీసుకెళ్లి, గొంతు కోసి హ‌త్య‌చేశాడు. ఆమె మృత‌దేహాన్ని కాలువ‌లో ప‌డేశాడు.

ఈ దిగ్భ్రాంతికర ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారి జిల్లాలో చోటు చేసుకుంది. హ‌తురాలి పేరు శ‌శిక‌ళ. వ‌య‌స్సు 21 సంవ‌త్స‌రాలు. ఆరేళ్ల కింద‌ట ఆమెకు జిల్లాలోని కంప్లి తాలూకా ప‌రిధిలోని రామ‌సాగ‌ర గ్రామానికి చెందిన ఉమేశ్‌తో వివాహ‌మైంది. భ‌ర్త‌, అత్తమామ‌ల‌తో క‌లిసి నివ‌సిస్తోంది.

పెళ్ల‌యి ఆరేళ్ల‌యిన‌ప్ప‌టికీ శ‌శిక‌ళ‌కు పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డంతో మ‌రో యువ‌తిని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో వివాహం చేసుకున్న‌ప్ప‌టి నుంచి శ‌శిక‌ళ‌ను హింసించేవాడు. ఆమెను అనుమానించేవాడు. అదే స‌మ‌యంలో శ‌శిక‌ళ గ‌ర్భం దాల్చింది. శ‌శిక‌ళ‌కు పుట్ట‌బోయేది త‌న బిడ్డ కాద‌ని సందేహిస్తుండేవాడు.

అదే అనుమానంతో అత‌ను శ‌శిక‌ళ‌ను హ‌త్య చేయాల‌ని ప‌థ‌కం ప‌న్నాడు. శుక్ర‌వారం రాత్రి శ‌శిక‌ళ‌కు ఘ‌నంగా సీమంతం నిర్వ‌హించాడు. మ‌రుస‌టి రోజు ఉద‌యం పుట్టింటికి తీసుకెళ్తానని న‌మ్మించి, ఆమెను బైక్‌పై ఎక్కించుకెళ్లాడు. రామ‌సాగ‌ర శివార్ల‌లోని క్వారీల‌కు తీసుకెళ్లి, గొంతుకోసి హ‌త‌మార్చాడు. మృత‌దేహాన్ని కాలువ‌లో ప‌డేశాడు.

ఆదివారం ఉద‌యం ఈ విష‌యం పోలీసుల దృష్టికి వ‌చ్చింది. ఉమేశ్‌పై అనుమానాలు వ్య‌క్తం కావ‌డంతో కంప్లి పోలీసులు అత‌ణ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సంద‌ర్భంగా అత‌ను త‌న నేరాన్ని అంగీక‌రించాడు. అత‌నిపై హ‌త్య కేసు న‌మోదు చేసిన పోలీసులు, రిమాండ్‌కు పంపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here