ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్‌! కేబుల్ ఆప‌రేట‌ర్‌ను క్వారీలో క‌ప్పెట్టారు..!

ఫేస్‌బుక్ ద్వారా ఓ మ‌హిళ‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ఓ యువ‌కుడి దారుణ‌హ‌త్య‌కు దారి తీసింది. సినీ ఫ‌క్కీలో ఆ యువ‌కుడిని రాతి గ‌నుల వ‌ద్ద‌కు పిలిపించి, మ‌రీ అక్క‌డే హ‌త్య చేశారు. అత‌ని మృత‌దేహాన్ని క్వారీలోనే క‌ప్పెట్టారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ జిల్లా శికారిపుర తాలూకాలోని జక్కిన‌కొప్ప గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి పేరు సంజ‌య్‌కుమార్‌.

జ‌క్కిన‌కొప్ప గ్రామంలో కేబుల్ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. త‌న వృత్తి రీత్యా అత‌ను ఆ ఊరిలోని వారంద‌రికీ సుప‌రిచితుడు. అదే గ్రామానికి చెందిన హ‌రీష్‌బాబు అనే క్వారీ య‌జ‌మాని భార్య‌తో సంజ‌య్‌కుమార్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఫేస్‌బుక్ ద్వారా ఆ ప‌రిచ‌యం మ‌రింత బ‌ల‌ప‌డింది. త‌ర‌చూ ఆమె సంజ‌య్‌కుమార్‌తో ఛాట్ చేస్తుండ‌టం హ‌రీష్‌బాబుకు న‌చ్చలేదు.

దీనితో అత‌ను ప‌లుమార్లు వారిద్ద‌ర్నీ హెచ్చ‌రించాడు కూడా. అయిన‌ప్ప‌టికీ.. ఆమె వినిపించుకోలేదు. దీనితో సంజ‌య్‌ను మ‌ట్టుబెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. మంగ‌ళ‌వారం ఉద‌యం అత‌ను సంజ‌య్‌కుమార్‌ను త‌న క్వారీకి పిలిపించుకున్నాడు. అక్క‌డే హ‌త్య‌చేశాడు. మృత‌దేహాన్ని అక్క‌డే పాతిపెట్టారు.

రెండురోజులుగా త‌మ కుమారుడు క‌నిపించ‌ట్లేదంటూ సంజ‌య్ త‌ల్లిదండ్రులు శికారిపుర రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ద‌ర్యాప్తులో భాగంగా గురువారం సాయంత్రం అత‌ని మృత‌దేహం హ‌రీష్‌బాబు క్వారీలో క‌నిపించింది. దీనితో అత‌ణ్ని విచారించ‌గా త‌న నేరాన్ని అంగీక‌రించాడు. హ‌రీష్‌బాబుతో పాటు అత‌నికి స‌హ‌క‌రించిన సురేశ్‌, న‌ర‌సింహ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here