పెళ్ల‌యిన మూడువారాల‌కే.. తాళి క‌ట్టిన భ‌ర్త‌పైనే!

పెళ్ల‌యిన మూడు వారాల‌కే భ‌ర్త‌ను హ‌త్య చేయ‌డానికి ప్ర‌య‌త్నించిందో యువ‌తి. ఇష్టం లేని పెళ్లి చేశార‌నే కోపంతో..తాళి క‌ట్టిన భ‌ర్త‌ను హ‌త్య చేయ‌బోయింది. క‌త్తితో మెడ న‌ర‌క‌పోయింది. భార్య చేసిన ఈ దాడి నుంచి ఆ యువ‌కుడు తృటిలో త‌ప్పించుకోగ‌లిగిన‌ప్ప‌టికీ.. మెడ‌పై తీవ్ర గాయాల‌య్యాయి.

ఈ ఘ‌ట‌న శ్రీ‌కాకుళం జిల్లా సంత‌బొమ్మాళి మండ‌లంలో చోటు చేసుకుంది. సంత‌బొమ్మాళి మండలంలోని మాలనర్సాపురం గ్రామానికి చెందిన నవీన్‌కుమార్‌కు అదే మండ‌లానికి చెందిన నీలిమతో ఈ నెల 9వ తేదీన వివాహమైంది. నాలుగు రోజుల క్రితం నవీన్‌కుమార్ భార్య‌తో క‌లిసి అత్తవారి గ్రామమైన గొదలాం వెళ్లారు.

తిరిగి సోమవారం సాయంత్రం బైక్‌పై మాలనర్సాపురానికి బ‌య‌లుదేరారు. మార్గ‌మ‌ధ్య‌లో వడ్డివాడ రైల్వేగేటు స‌మీపానికి రాగానే నీలిమ త‌న అస‌లు స్వ‌రూపాన్ని చూపింది. త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో భర్త నవీన్‌కుమార్‌ మెడపై పొడిచింది. క‌త్తిపోటుకు గురై కింద ప‌డ్డ న‌వీన్ ఛాతీపై కూర్చుని గొంతు నులిమి హ‌త్య చేయ‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది నీలిమ‌. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ దాడి నుంచి తేరుకున్న న‌వీన్..ర‌క్షించాలంటూ గ‌ట్టిగా కేక‌లు వేశాడు.

దీంతో పొలాల్లో ప‌నిచేస్తున్న వారు వ‌చ్చి అత‌ణ్ని ర‌క్షించారు. మెడపై గాయంతో క‌నిపించిన నవీన్‌కుమార్‌ను కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

ఈ విషయమై భార్య నీలిమను పలువురు ప్రశ్నించగా ఏం జరిగిందో తెలియలేదని, తాను చాకుతో పొడవలేదని చెప్పడం అనుమానాలకు తావిస్తుంది. సంతబొమ్మాళి ఎస్సై రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఆమెను విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here