రీసెర్చ్ స్కాల‌ర్‌! కాబోయే భ‌ర్త‌తో వీడియో కాల్ చేస్తూ, చేస్తూ..!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న యువ‌తి పేరు ఖ్యాతి. ప్ర‌తిష్ఠాత్మక బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్శిటీ విద్యార్థిని. ప‌ర్యావ‌ర‌ణ విభాగంలో రీసెర్చ్ స్కాల‌ర్‌. ఉన్న‌ట్టుండి మంగ‌ళ‌వారం ఉద‌యం ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. త‌న కాబోయే భ‌ర్త‌తో వీడియో కాల్ ద్వారా ఛాట్ చేస్తూ, చేస్తూ.. అత‌ని క‌ళ్ల‌ముందే ఉరి వేసుకుని, బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

దీనికి గ‌ల కార‌ణ‌మేంటో తెలియ‌రావ‌ట్లేదు గానీ.. అనారోగ్య స‌మ‌స్య‌లే అయి ఉంటాయ‌ని అనుమానిస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ బేతుల్ న‌గ‌రానికి చెందిన ఖ్యాతి.. బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్శిటీలో రీసెర్చ్ స్కాల‌ర్‌. వార‌ణాశిలోని లంకా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న న‌వ్‌గావ్ ప్రాంతంలో నాగేశ్వ‌ర్ సింహ్ అనే వ్యక్తి ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ చ‌దువుకుంటున్నారు.

కొద్దిరోజుల కింద‌ట ఖ్యాతికి మ‌ర్చంట్ నేవీ ఉద్యోగి శ్వేతాంగ్ కుమార్‌తో నిశ్చితార్థ‌మైంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో వారి వివాహం జ‌రుగ‌నుంది. ఈ ఉద‌యం శ్వేతాంగ్ కుమార్ ఆమెకు వీడియో కాల్ చేశారు. చాలాసేప‌టి వ‌ర‌కూ మాట్లాడుతూ ఉండిపోయారు. ఆ త‌రువాత ఏమైందో ఏమో గానీ.. అత‌నితో మాట్లాడుతూనే ఖ్యాతి.. ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

దీన్ని చూసిన శ్వేతాంగ్ కుమార్ వార‌ణాశికి సుమారు 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న రామ్‌న‌గ‌ర్ నుంచి హుటాహుటిన న‌వ్‌గావ్‌కు వ‌చ్చారు. నాగేశ్వ‌ర్ సింహ్‌కు స‌మాచారం ఇచ్చారు. ఖ్యాతి నివ‌సిస్తోన్న గ‌ది త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి లోనికి ప్ర‌వేశించారు. అప్ప‌టికే ఆమె త‌న దుపట్టాకు ఉరి వేసుకున్నారు.

ఈ స‌మాచారాన్ని వారు లంకా పోలీస్‌స్టేష‌న్‌కు చేర‌వేశారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఖ్యాతి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్వేతాంగ్‌కుమార్‌తో సాగించిన వీడియో సంభాష‌ణ రికార్డుల‌ను తీసుకున్నారు. దీని ఆధారంగా కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here