క‌ట్టుకున్న భార్య‌ను చంప‌డానికి దుబాయ్ నుంచి వ‌చ్చాడు! రంజాన్ షాపింగ్ పేరుతో..!

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని డ‌బీర్‌పురా రైల్వేస్టేష‌న్ ఎదురుగా చెత్త కుప్ప‌లో క‌నిపించిన మ‌హిళ మృత‌దేహం మిస్ట‌రీని పోలీసులు ఛేదించారు. భ‌ర్తే హంత‌కుడిగా తేల్చారు. రంజాన్ పండుగ కోసం దుబాయ్ నుంచి వ‌చ్చిన భ‌ర్త‌.. ఆమెను హ‌త్య చేశాడ‌ని నిర్ధారించారు. హ‌తురాలి పేరు జెబ‌నాజ్‌.

నారాయణ‌గూడ కింగ్‌కోఠిలో భ‌ర్త అక్బ‌ర్ అలీఖాన్‌, ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి నివ‌సిస్తున్నారు. ఆజంపురా స‌మీపంలోని ఫర్హత్‌నగర్‌కు చెందిన అక్బర్ అలీఖాన్‌తో పదేళ్ల కిందట ఆమెకు వివాహమైంది. ఉద్యోగ నిమిత్తం గత రెండేళ్లుగా అక్బ‌ర్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు. నాలుగు రోజుల కింద‌టే హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు.

భ‌ర్త ఊరిలో లేక‌పోవ‌డంతో ఆమె కొద్దిరోజులుగా పుట్టింట్లో ఉంటున్నారు. రంజాన్‌ మాసం పుర‌స్క‌రించుకుని షాపింగ్ చేద్దామ‌ని ఈ నెల 19న ఉన్న భార్యను తీసుకుని వెళ్లాడు. అంతే! మ‌ళ్లీ ఆమె వెన‌క్కి రాలేదు. ఎంత రాత్ర‌యినా కుమార్తె జాడ తెలియ‌క‌పోవ‌డం, ఫోన్ స్విచాఫ్ రావ‌డంతో అనుమానం వచ్చిన తల్లి షబ్నమ్‌ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డబీర్‌పురా రైల్వేస్టేష‌న్‌లో స‌మీపంలో కాలువ పక్కనే దొరికిన మూటలో మృతదేహం ల‌భించ‌డంతో డ‌బీర్‌పురా పోలీసులు ష‌బ్న‌మ్‌కు సమాచారం అందించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే ఉస్మానియా ఆసుప‌త్రికి వెళ్లిన ష‌బ్న‌మ్ మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని చూసి స్పృహ త‌ప్పారు. అది త‌న కుమార్తెదేన‌ని వెల్ల‌డించారు. నారాయ‌ణగూడ పోలీసులు ఈ కేసును డ‌బీర్‌పురాకు బ‌దలాయించారు.

చివ‌రిసారిగా ఆమె భ‌ర్త‌తో వెళ్లింద‌ని ష‌బ్న‌మ్ తెలిపారు. దీనితో పోలీసులు అక్బర్ అలీఖాన్ కోసం గాలిస్తున్నారు. అత‌ను దుబాయ్‌కు పారిపోయి ఉంటాడ‌ని భావిస్తున్నారు. దీనికోసం శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ప్ర‌యాణికుల జాబితాను ప‌రిశీలిస్తున్నారు. త్వ‌ర‌లోనే అత‌ణ్ని అరెస్టు చేస్తామ‌ని డ‌బీర్‌పురా పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here