కూర‌గాయ‌ల కోసం సైకిల్‌పై ఒంట‌రిగా వెళ్లింది.. రోడ్డు ప‌క్క‌న పూర్తిగా కాలిన మృత‌దేహంగా!

ల‌క్నో: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో మ‌రో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 19 సంవ‌త్స‌రాల ఓ యువ‌తిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు స‌జీవంగా ద‌హ‌నం చేశారు. గురువారం రాత్రి ఉన్నౌ జిల్లాలోని బారాస్‌గ‌వ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

హ‌తురాలిని స‌థ‌నీబాలా ఖేడా గ్రామానికి చెందిన యువ‌తిగా గుర్తించారు. గురువారం సాయంత్రం కూర‌గాయ‌ల‌ను కొన‌డానికంటూ ఒంట‌రిగా సైకిల్‌పై సంతకు వెళ్లారు. ప్ర‌తి గురువార‌మూ ఆ గ్రామ శివార్ల‌లో కూర‌గాయ‌ల సంత‌ను ఏర్పాట‌వుతుంటుంది.

వారానికి స‌రిప‌డే కూర‌గాయ‌ల‌ను తెచ్చుకోవ‌డం అల‌వాటు. ఇందులో భాగంగా.. ఆమె సాయంత్రం సైకిల్‌పై సంత‌కు వెళ్లారు. ఆమె అక్క‌డిదాకా వెళ్ల‌లేదు.

మార్గ‌మ‌ధ్య‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను అట‌కాయించారు. స‌మీపంలోని పొద‌ల్లోకి లాక్కెళ్లారు. అక్క‌డే పెట్రోలు పోసి త‌గుల‌బెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో ఆమె స‌జీవ ద‌హ‌న‌య్యారు.

రాత్ర‌యిన‌ప్ప‌టికీ.. త‌మ కుమార్తె ఎంత‌కీ ఇంటికి రాక‌పోవ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు వెదుక్కుంటూ వెళ్ల‌గా.. రోడ్డు ప‌క్క‌న సైకిల్, దానికి కొంత దూరంలో బ్యాగ్ క‌నిపించాయి.

దీనితో ఆందోళ‌న‌కు గురైన త‌ల్లిదండ్రులు ఇంకొంత దూరం వెళ్లి చూడ‌గా..పూర్తిగా కాలిపోయిన మృత‌దేహం క‌నిపించింది. దీన్ని చూసిన వారు మూర్ఛిల్లారు.

ఈ స‌మాచారం అందిన వెంట‌నే బారాస్‌గ‌వ‌ర్ పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘ‌ట‌నాస్థ‌లానికి చుట్టు ప‌క్క‌ల వెద‌గ్గా.. ఎలాంటి అనుమానాస్ప‌ద వ‌స్తువులు దొర‌క‌లేదు.

ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా తీవ్ర ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీనితో ఉన్నౌ జిల్లా ఎస్పీ పుష్పాంజ‌లి దేవి సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గ్రామ‌స్తుల‌తో మాట్లాడారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here