బాకీ వ‌సూలు కోసం వ‌చ్చే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం: ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను లేపేసింది!

హైద‌రాబాద్‌: త‌న భ‌ర్తకు అప్పు ఇచ్చిన వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుందో భార్య‌. అప్పును వ‌సూలు చేయ‌డానికి రెండోరోజుల‌కోసారి ఇంటికొచ్చే ఆ వ్య‌క్తిని వ‌ల‌లో వేసుకుంది. ఈ విష‌యం త‌న భ‌ర్త‌కు తెలియ‌డంతో..ప్రియుడితో క‌లిసి అత‌ణ్ణి హ‌త‌మార్చింది. హైద‌రాబాద్ జీడిమెట్ల పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

భ‌ర్త మృతదేహానికి అంత్య‌క్రియ‌లను నిర్వ‌హించ‌డానికి గుట్టుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌పై, పొంత‌న లేని మాట‌ల‌పై అనుమానం రావ‌డంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల రంగ‌ప్ర‌వేశంతో ఆమె గుట్టు ర‌ట్ట‌యింది. హ‌తుడి పేరు సింహాచ‌లం. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సింహాచలం ప‌దేళ్ల కింద‌ట హైద‌రాబాద్‌కు వ‌చ్చారు.

భార్య విజయతో క‌లిసి కుత్బుల్లాపూర్‌లో నివ‌సిస్తున్నాడు. సింహాచలం చిరు వ్యాపారి. ఆర్థిక ప‌రిస్థితి అంతంత‌మాత్ర‌మే కావ‌డంతో గౌరినాయుడు అనే ఫైనాన్స్ వ్యాపారి వ‌ద్ద అప్పు తీసుకొనేవాడు. బాకీ వసూలు కోసం గౌరినాయుడు రెండు, మూడురోజులకోసారి సింహాచ‌లం ఇంటికి వెళ్లేవాడు. ఈ నేప‌థ్యంలో అత‌నికి సింహాచ‌లం భార్య విజయ‌తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. వారిద్ద‌రి వ్య‌వ‌హారం సింహాచలం దృష్టికి వ‌చ్చింది.

దీనితో అత‌ను త‌ర‌చూ భార్య‌తో గొడ‌వ‌ప‌డుతుండేవాడు. గురువారం రాత్రి కూడా సింహాచ‌లం భార్యతో గొడవప‌డ్డాడు. రాత్రి 9 గంట‌ల‌కు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున సింహాచలం ఇంటి ముందు నిర్జీవంగా ప‌డి ఉండ‌టాన్ని స్థానికులు గుర్తించారు. వారు వెంట‌నే విజయకు ఈ విష‌యాన్ని చెప్పారు.

సింహాచ‌లాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే అత‌ను మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు ధృవీక‌రించారు. రాత్రి ఎక్కువ‌గా మ‌ద్యం తాగాడ‌ని, ఆ మ‌త్తులోనే త‌న భ‌ర్త మ‌ర‌ణించాడ‌ని విజ‌య స్థానికుల‌ను న‌మ్మించింది.

గుట్టుగా అత‌ని మృత‌దేహానికి అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేసింది. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌పై స్థానికుల‌కు అనుమానం వ‌చ్చింది. దీనితో వారు జీడిమెట్ల పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. మృత‌దేహాన్ని ప‌రిశీలించిన పోలీసులు అది హ‌త్య‌గా నిర్ధారించారు. భారీ వ‌స్తువుతో ఛాతీపై కొట్ట‌డంతో పాటు గొంతు నులిమిన ఆన‌వాళ్లు క‌నిపించాయి.

దీనితో వారు విజ‌య‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీనితో ఆమె అస‌లు విష‌యాన్ని అంగీక‌రించింది. గౌరి నాయుడుతో క‌లిసి భ‌ర్త‌ను హ‌త్య చేసిన‌ట్లు వెల్ల‌డించింది. విజ‌య‌ను అరెస్టు చేసిన, పోలీసులు ప‌రారీలో ఉన్న గౌరినాయుడు కోసం అన్వేషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here