యువ‌తి మృత‌దేహంతో న‌గ్న‌పూజ‌లు! ఆమెను తిరిగి బ‌తికిస్తామంటూ త‌ల్లిదండ్రుల‌ను న‌మ్మించి..!

జైపూర్‌: మూఢ‌న‌మ్మ‌కాలు మ‌రీ ఇంత దారుణంగా ఉంటాయా? అనిపించే ఉదంతం ఇది. రాజ‌స్థాన్‌లోని స‌వాయ్ మాధోపూర్ జిల్లా గంగాపూర్ సిటీలో చోటు చేసుకుంది. ఓ యువ‌తి అర్ధాంత‌రంగా త‌నువు చాలిస్తే..ఆమె మ‌ళ్లీ లేచి కూర్చుంటుంద‌ని, అలా కూర్చోనేలా చేస్తామ‌ని త‌ల్లిదండ్రుల‌ను న‌మ్మించారు ముగ్గురు మంత్ర‌గాళ్లు.

నెల‌రోజుల పాటు ఆ యువ‌తి మృత‌దేహాన్ని ఇంట్లో దాచి ఉంచారు. దుర్వాస‌న రాకుండా ర‌సాయ‌నాల‌ను పూశారు. యువ‌తి మృత‌దేహంతో న‌గ్న‌పూజ‌లు చేశారు. ఆమెను పున‌రుజ్జీవింప‌జేస్తామంటూ త‌ల్లిదండ్రుల‌ను న‌మ్మించి, వారి నుంచి భారీ మొత్తాన్ని గుంజారు.

చివ‌రికి- ఈ వ్య‌వ‌హారం త‌మ దృష్టికి రావ‌డంతో స్థానికులు పోలీసుల‌కు తెలియ‌జేశారు. ఈ ఘ‌ట‌న‌లో త‌ల్లిదండ్రులు స‌హా ఆరుమందిని శ్రీ‌గంగాన‌గ‌ర్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలి పేరు అనిత‌. 35 సంవ‌త్స‌రాల అనిత‌కు త‌ల్లిదండ్రులు, సోద‌రి, సోద‌రుడు ఉన్నారు. ముగ్గుర్లోనూ ఆమే పెద్ద‌.

కొన్నిరోజులుగా త‌మ సోద‌రి క‌నిపించ‌క‌పోవ‌డంతో వారు త‌ల్లిదండ్రుల‌ను అడ‌గ్గా.. అనారోగ్యంగా ఉంద‌ని, అందుకే ఇంట్లోంచి బ‌య‌టికి రావ‌ట్లేద‌ని న‌మ్మబ‌లికారు. సుమారు నెల‌రోజులు కావ‌స్తున్న‌ప్ప‌టికీ.. అనిత క‌నిపించక పోవ‌డంతో వారు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. త‌మ సోద‌రి అనారోగ్యంగా ఉంద‌ని, చూడ్డానికి మంత్ర‌గాళ్లు అనుమతించ‌ట్లేద‌ని చెప్పారు.

దీనితో రంగంలోకి దిగిన పోలీసులు అనిత‌కు చికిత్స అందిస్తున్న‌ట్టుగా చెబుతోన్న ఇంటికి వెళ్లి చూడ‌గా.. మొద‌ట మంత్ర‌గాళ్లు అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ వారి హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు బ‌ల‌వంతంగా లోనికి వెళ్లి చూడ‌గా.. అనిత మృత‌దేహం న‌గ్నంగా, భ‌యాన‌క స్థితిలో క‌నిపించింది. వెంట‌నే పోలీసులు డాక్ట‌ర్ల‌కు స‌మాచారం ఇచ్చారు.

డాక్ట‌ర్లు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్ట్‌మార్ట‌మ్ కోసం తీసుకెళ్లారు. అనిత మ‌ర‌ణించి.. క‌నీసం 30 నుంచి 40 రోజులు అయి ఉంటుంద‌ని చెప్పారు.

దీనితో పోలీసులు ఆమె త‌ల్లిదండ్రులు, మంత్ర‌గాళ్ల‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. జ‌న‌వ‌రి 15వ తేదీనే అనిత చ‌నిపోయింద‌ని అన్నారు. ఆమెను తిరిగి బ‌తికిస్తామ‌ని మంత్ర‌గాళ్లు చెప్ప‌డాన్ని తాము విశ్వ‌సించామ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అనిత త‌ల్లిదండ్రుల‌తో పాటు మంత్ర‌గాళ్ల‌ను అరెస్టు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here