వ‌రుడి పైశాచికం! భార్య‌ కాళ్లూ, చేతులు క‌ట్టేసి స్టోర్‌రూమ్‌లో! 48 గంట‌లుగా అక్క‌డే అన్నీ

ఆరు నెల‌ల కింద‌టే పెళ్ల‌యిన న‌వ వధూవ‌రులు వారు. క‌ట్టుకున్న భార్యను కాలు కింద పెట్ట‌నీయ‌కుండా చూసుకోవాల్సిన భ‌ర్త‌.. ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. ఆరు నెల‌ల కింద‌ట త‌న‌ను న‌మ్మి, త‌న‌తో పాటు వ‌చ్చిన భార్య‌పై పైశాచికంగా ప్ర‌వ‌ర్తించాడు. భార్య కాళ్లు, చేతులు క‌ట్టేసి స్టోర్‌రూమ్‌లో ప‌డేశాడు.

గంటో, రెండు గంట‌లో కాదు.. ఏకంగా 48 గంట‌ల పాటు ఆమె ఆ చీక‌టి గ‌దిలో చిత్ర‌హింస‌ను అనుభ‌వించింది. ఆదివారం అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత ఆమె పెట్టిన కేక‌లు విని, పెట్రోలింగ్ పోలీసులు వ‌చ్చి, ఆమెను విడిపించారు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న నోయిడాలో చోటు చేసుకుంది. ఆ స‌మ‌యానికి ఆమె మూడునెల‌ల గ‌ర్భిణి కూడా. ఆ మ‌హిళ పేరు రాగిణి (పేరుమార్చాం).

గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ఆమెకు నోయిడాలోని సెక్టార్ 39కు చెందిన గౌర‌వ్‌తో వివాహ‌మైంది. పెళ్ల‌యిన రెండు నెల‌ల పాటు ఆమె భ‌ర్త‌తో సుఖ‌సంతోషాల‌తో గ‌డిపారు. ఆ త‌రువాత ఆమెకు టార్చ‌ర్ చూపారు భ‌ర్త‌, అత్తామామ‌లు. దీనికి కార‌ణం- అద‌న‌పు క‌ట్నం. అద‌న‌పు క‌ట్నం ఇవ్వ‌లేదన్న ఒకే ఒక్క కార‌ణంతో ఆమెపై దాడి చేశారు.

ఈ నెల 1వ తేదీన రాగిణి కాళ్లు, చేతులు కట్టేసి, బేస్‌మెంట్‌లోని స్టోర్‌రూమ్‌లో ప‌డేశారు. భార్య‌ క‌నిపించ‌ట్లేదంటూ గౌర‌వ్ అత్తామామ‌లకు స‌మాచారం ఇచ్చాడు. ఆ త‌రువాత సెల్‌ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఫోన్‌లో అందుబాటులో లేకుండా పోయాడు.

ఆదివారం అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత‌.. ఆమె పెట్టిన కేక‌లు నిశ్శ‌బ్ద వాతావ‌ర‌ణంలో ప్ర‌తిధ్వ‌నించాయి. వాటిని విన్న స్థానిక పెట్రోలింగ్ పోలీసులు రాగిణిని కాపాడారు. గౌర‌వ్‌, అత‌ని త‌ల్లిదండ్రుల‌పై కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం రాగిణి మూడు నెల‌ల గ‌ర్భిణి అని పోలీసులు తెలిపారు. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here