వర్మ మొబైల్, ల్యాప్ టాప్ లను సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకు..?

‘జీఎస్టీ’ సినిమాలో అశ్లీలత, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు విచారించారు. కాసేపటి క్రితమే విచారణ ముగిసింది. దాదాపు 3 గంటల 20 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. మొత్తం 24 ప్రశ్నలకు పోలీసులు వివరణ కోరినట్టు సమాచారం.

ఈ రోజు విచారణ ముగిసిన వెంటనే మరో నోటీసును వర్మకు అందజేశారు. వచ్చే శుక్రవారం కూడా మళ్లీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఆయన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు. నగ్నంగా ఉన్న మాల్కోవాతో వర్మ ఉన్న ఫొటోలను ఆయన ఫోన్, ల్యాప్ టాప్ నుంచి డౌన్ లోడ్ చేసి, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతామని… ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత… ఈ ఫొటోలన్నీ ఎలా వచ్చాయి? మీరు ఏం తీశారు? ఎందుకు తీశారు? అనే విషయాలను తదుపరి విచారణలో ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు.

‘జీఎస్టీ’ సినిమాను తాను తీయలేదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ తెలిపారు. ఈ రోజు వర్మను విచారించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదని… కేవలం కాన్సెప్ట్ మాత్రమే తనదని వర్మ చెప్పారని తెలిపారు. కాన్సెప్ట్ ను మాత్రమే తాను అమ్మానని వెల్లడించారని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ ను సేకరించాల్సి ఉందని అన్ని వైపుల నుంచి ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. స్కైప్ ద్వారా తాను డైరెక్ట్ చేశానని వర్మ తమతో చెప్పాడనీ.. సినిమాను ఎక్కడ తీసినా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. భారతీయ పౌరుడు విదేశాల్లో తప్పు చేసినా, ఇక్కడ శిక్షించవచ్చని తెలిపారు. సినిమా షూటింగ్ లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారా? లేదా? అనే విషయాన్ని తేల్చాల్సి ఉందని చెప్పారు.

ఈ కేసును ఆషామాషీగా విచారించలేమని, టెక్నికల్ గా చాలా ఆధారాలను సేకరించాల్సి ఉందని ఆయన అన్నారు. ఒకవేళ వర్మ దోషిగా తేలితే, రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. విచారణకు వర్మ పూర్తిగా సహకరించారని తెలిపారు. ఆయనను అరెస్ట్ చేసే అంశానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here